కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ చివరిగా ‘భారతీయుడు 2’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి డిజాస్టర్ అందుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ తో చేస్తోన్న ‘గేమ్ చేంజర్’ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. డిసెంబర్ 20కి ‘గేమ్ చేంజర్’ మూవీ రిలీజ్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే శంకర్ తాజాగా ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు. తమిళంలో ‘నవ యుగ నాయగన్ వేల్ పారీ’ అనే నవల హక్కులని కొనుగోలు చేశారు. ఈ నవలని మూడు భాగాలుగా సినిమా చేస్తానని ’ఇండియన్ 2’ మూవీ ప్రమోషన్స్ లో ప్రకటించారు.
అయితే రీసెంట్ గా ఒక కొత్త సినిమా ట్రైలర్ లో ఈ నవలలోని కొన్ని కీలక సన్నివేశాలని కాపీ కొట్టారని శంకర్ ఆరోపించారు. కాపీ రైట్ ఉల్లంఘనలు పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటానని అన్నారు. ఆ నవల హక్కులు తన దగ్గర ఉన్నాయని శంకర్ ట్వీట్ చేశారు. నవలలోని సన్నివేశాలని అనుమతి లేకుండా దొంగిలించి, కాపీ చేసి సినిమాలో పెట్టుకోవడం చూసి ఆవేదన చెందాను. ఆ నవలలోని సన్నివేశాలు సినిమాలు, వెబ్ సిరీస్ లలో ఉపయోగించడం మానుకోండి అంటూ శంకర్ హెచ్చరించారు.
అయితే శంకర్ ఈ హెచ్చరిక ఎవరికి చేశారనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. శంకర్ ‘దేవర’ ట్రైలర్ ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన పెద్ద సినిమా ట్రైలర్ ‘దేవర’ ఒకటే కనిపిస్తోంది. అలాగే సూర్య ‘కంగువ’ మూవీ కూడా అయ్యుండొచ్చు అనే మాట వినిపిస్తోంది. శంకర్ చెప్పిన ‘నవ యుగ నాయగన్ వేల్ పారీ’ నవల హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో ఫిక్షనల్ కథాంశంతో ఉంటుంది.
కథాంశం కూడా గిరిజన రాజులకి చెందినదిగా చెప్పబడింది. దీంతో ‘కంగువా’ మూవీ దగ్గర పోలికలు ఉన్నాయనే ప్రచారం నడుస్తోంది. అయితే శంకర్ తన ట్విట్టర్ లో పలానా మూవీ అని ప్రస్తావించలేదు. కాబట్టి ఏ చిత్రం అనేది చెప్పడం కష్టం. సోషల్ మీడియాలో మాత్రం ఈ రెండు సినిమాలో ఏదో ఒకదాంట్లో మాత్రం శంకర్ చెప్పిన ఆ నవలలో సన్నివేశాలు కాపీ చేసి ఉండొచ్చు అనే టాక్ వినిపిస్తోంది.
మరి ఏది వాస్తవమో తెలియాలంటే ఆ సినిమాలు రిలీజ్ అయ్యాక శంకర్ తీసుకునే చర్యల బట్టి స్పష్టత వస్తుంది. శంకర్ అయితే ‘గేమ్ చేంజర్’ తర్వాత ‘నవ యుగ నాయగన్ వేల్ పారీ’ నవల ఆధారంగానే మూవీ చేయాలనే లక్ష్యంగా ఉన్నారని అర్ధమవుతోంది.