ప్లాన్ మారుస్తున్న ఎన్టీఆర్… ఇకపై ఇదే ఫిక్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలోగా ప్రేక్షకుల ముందుకొచ్చి ఆరేళ్ళు అవుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ కి ముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘అరవింద సమేత’ 2018లో రిలీజ్ అయ్యింది. మరల 2024లో ‘దేవర పార్ట్ 1’తో తారక్ ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. సెప్టెంబర్ 27న ఈ సినిమా గ్రాండ్ గా పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషలలో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాపై భారీ హైప్ నెలకొని ఉంది. ఎన్టీఆర్ కూడా ‘దేవర పార్ట్ 1’ సినిమాని స్ట్రాంగ్ గా పబ్లిక్ లోకి పంపించే పనిలో ఉన్నారు.

ప్రమోషన్స్ చాలా యాక్టివ్ గా నడుస్తున్నాయి. ఇదిలా ఉంటే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత దేవర సినిమాని రిలీజ్ చేయడానికి తారక్ చాలా టైం తీసుకున్నారు. అయితే ఇకపై సినిమాల విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువ గ్యాప్ తీసుకోకూడదని అనుకుంటున్నారు. ‘దేవర’ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ లైన్ అప్ లో ‘వార్ 2’, ‘డ్రాగన్’, ‘దేవర పార్ట్ 2’ సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పాన్ ఇండియా చిత్రాలుగానే రానున్నాయి.

అయితే ఈ సినిమాలు ఏడాదికి ఒకటి కచ్చితంగా రిలీజ్ అయ్యేలా ఎన్టీఆర్ ప్లానింగ్ చేసుకుంటున్నారంట. ఆరేళ్ళుగా సోలో రిలీజ్ లేకపోవడం ఫ్యాన్స్ చాలా అసంతృప్తితో ఉన్నారు. అలాగే ఇండస్ట్రీలో కూడా హీరోల లైన్ అప్, మూవీకి మూవీకి ఎక్కువ గ్యాప్ తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని ఏడాదికి ఒక సినిమాని కచ్చితంగా రిలీజ్ చేసేలా ఎన్టీఆర్ ప్లాన్ చేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందులో భాగంగా హిందీలో తెరకెక్కుతోన్న ‘వార్ 2’ చిత్రంతో వచ్చే ఏడాది ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు.

2025 ఆగష్టు 15కి, ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘డ్రాగన్’ మూవీని 2026న రిలీజ్ చేయనున్నారు. ప్లాన్ కు తగ్గట్లుగానే ఈ సినిమా షూటింగ్ వీలైనంత వేగంగా పూర్తి చేయాలని తారక్ అనుకుంటున్నారు. అలాగే వచ్చే ఏడాదిలోనే ‘దేవర పార్ట్ 2’ షూటింగ్ మొదలుపెట్టి వేగంగా కంప్లీట్ చేసి 2027లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

ఆ తరువాత అవకాశాన్ని బట్టి వెట్రిమారన్ తో సినిమాని తీసుకురావాలని ఎన్టీఆర్ ఒక క్యాలెండర్ సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏడాదికి ఒక సినిమా అంటే ఫ్యాన్స్ నుండి ఒత్తిడి ఉండదు. వారిని సంతోషపెట్టినట్లు అవుతుంది. వర్క్ పరంగా కూడా పెద్దగా టెన్షన్ ఉండదు. అలాగే ఇండస్ట్రీలో సినీ కార్మికులకి ఏడాది పొడవున తన మూవీస్ ద్వారా పని కల్పించినట్లు అవుతుంది. ఇవన్నీ ఆలోచించుకొని ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాల రిలీజ్ ప్లాన్ చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.