కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. ఒకవైపు సినిమాలు చేసుకుంటూనే రాజకీయాల్లో సైతం యాక్టివ్ అయిన ఆయన.. గత ఎన్నికల్లో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ హడావిడిలోనే సినిమాలకు పవర్ స్టార్ దూరం అయ్యారు. దీంతో ఆయన అభిమానులు నిరాశగా ఉండిపోయారు.
పాలిటిక్స్ చేస్తూనే ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను కూడా కంప్లీట్ చేయాలని పవన్ కల్యాణ్ డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ చిత్రీకరణలో సైతం పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు పవన్ కల్యాణ్ ‘OG’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీపై ఫోకస్ చేశారు. ఇందులో భాగంగానే ఆయన తాజాగా ఈ సినిమా సెట్స్‌లోకి అడుగు పెట్టేశారు.
టాలీవుడ్లో యంగ్ డైరెక్టర్ సుజిత్‌తో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేస్తున్న చిత్రమే ‘OG’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్). యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమా ముంబై నేపథ్యంతో సాగే ఓ గ్యాంగ్‌స్టర్ స్టోరీతో తెరకెక్కుతోందని తెలిసిందే. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో తాజాగా మొదలు పెట్టారు.
ఇందులో పవన్ కల్యాణ్ కూడా పాల్గొంటున్నట్లు తెలిసింది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ‘OG’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమా షూటింగ్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో పాటు కొందరు ప్రధాన నటీనటులు భాగం అయ్యారు. ముఖ్యంగా ఈ షెడ్యూల్లో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ – పవన్ కల్యాణ్ మధ్య కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. అలాగే, వీళ్లిద్దరిపై ఓ ఫైట్ సీన్‌ను సైతం షూట్ చేస్తారని అంటున్నారు.
వాస్తవానికి పవన్ కల్యాణ్ – ప్రకాశ్ రాజ్ మధ్య ఇటీవలే రాజకీయ పరమైన కొన్ని వాదనలు జరిగాయి. సోషల్ మీడియా వేదికగా ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ముఖ్యంగా సనాతన ధర్మం గురించి ప్రకాశ్ రాజ్ కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై పవన్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఇలాంటి సమయంలో పవన్, ప్రకాశ్ రాజ్ షూట్లో పాల్గొనడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.
డిఫరెంట్ యాక్షన్‌తో రాబోతున్న ‘OG’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయా రెడ్డి సహా ఎంతో మంది కీలక పాత్రల్లో చేస్తున్నారు.