జక్కన్నను మించి త్రివిక్రమ్ ఏం చేస్తున్నట్లు?

ఒకప్పుడు రాజమౌళి సగటు మాస్ మసాలా సినిమాలు తీసే దర్శకుడు. కానీ ‘మగధీర’ నుంచి ఆయన ప్రయాణం మారిపోయింది. అప్పటిదాకా ఆయన తరం దర్శకులు ఊహించడానికి కూడా భయపడే కథలను ఆయన అద్భుత రీతిలో తెరకెక్కించడం మొదలుపెట్టారు. మగధీర తర్వాత ‘ఈగ’, ఆపై ‘బాహుబలి’ తీసి ఎవ్వరూ అందుకోని స్థాయికి చేరుకున్నారు.

ఐతే ఆయన తరం స్టార్ డైరెక్టర్లలో ఎంతో విషయం ఉండి ఇలాంటి భారీ ప్రయత్నాలు చేయలేదని త్రివిక్రమ్ విషయంలో అభిమానులు బాధ పడుతుంటారు. ఇంకా ఎన్నాళ్లు ఫ్యామిలీ, మాస్ సినిమాలే తీస్తుంటారని అసహనం చెందుతుంటారు. ఐతే ఎట్టకేలకు ఆయన కూడా ఓ భారీ కాన్వాస్‌లో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. అల్లు అర్జున్ హీరోగా ఆయన తీయబోయేది ఒక ఈవెంట్ మూవీనే అనే ప్రచారం ముందు నుంచి ఉంది.

ఈ సినిమాను ప్రొడ్యూసర్లలో ఒకరైన బన్నీ వాసు ఇంతకుముందే దీని కాన్వాస్ గురించి ఒక రేంజిలో చెప్పాడు. తాజాగా మరో నిర్మాత నాగవంశీ సైతం చాలా గొప్పగా మాట్లాడాడు. రాజమౌళి మనకు చాలా చూపించాడంటూనే ఆయన కూడా చూపించని ప్రపంచాన్ని చూపించనున్నట్లు నాగవంశీ తెలిపాడు. ఎవ్వరూ టచ్ చేయని పాయింట్ అంటూ ఊరించాడు.

రాజమౌళిని మించి విజువల్ వండర్ తీయడానికి త్రివిక్రమ్ ప్రయత్నిస్తున్నాడంటే రచయితగా, దర్శకుడిగా తన శక్తి సామర్థ్యాలన్నింటినీ ఈ సినిమా మీద పెడుతున్నట్లే. తెలుగులో మరే దర్శకుడికీ లేని స్థాయిలో సాహిత్యం, పురాణాల మీద త్రివిక్రమ్‌కు పట్టు ఉంది. కానీ ఆ లోతును తన సినిమాల్లో చూపించడని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. కానీ ఈసారి త్రివిక్రమ్ తన సత్తాను ఈ సినిమాలో చూపిస్తాడని ఆశిస్తున్నారు.

రాజమౌళిని మించి ఏదో చేస్తున్నాడంటే ఆయన చారిత్రక నేపథ్యం ఉన్న కథనే ఎంచుకుని ఉంటాడని.. ఫాంటసీ అంశాలను కూడా టచ్ చేసే అవకాశముందని.. ఇప్పటిదాకా త్రివిక్రమ్‌ను ఒక యాంగిల్‌లో చూస్తూ వచ్చిన ప్రేక్షకులకు ఆయన షాకివ్వడం ఖాయమని.. దీంతో ఒకేసారి పాన్ ఇండియా కోటను బద్దలు కొట్టేయడం ఖాయమని అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు.