ఎవరీ ఇందు రెబకావర్గీస్? తెలిశాక గుండె బరువెక్కుతుంది

మరో రెండు రోజుల్లో వెండి తెరను పలుకరించనుంది ‘అమరన్’ మూవీ. రూ.150-200 కోట్ల భారీ బడ్జెట్ తో తీసిన ఈ మూవీలో శివ కార్తికేయ లీడ్ రోల్ ప్లే చేస్తే.. సాయి పల్లవి కీలక పాత్రను పోషించింది. ఈ సినిమా రీల్ కథ కాదు రియల్ కథ అన్న విషయం తెలిశాక.. సాయిపల్లవి పాత్ర మీద ఆసక్తి వ్యక్తమైంది. పాత్రనే తప్పించి.. ఆ పాత్రకు తగిన గ్లామర్ ఉండాలని కోరుకోని సాయిపల్లవి.. ఈ పాత్ర చేయటానికి వెనుకున్న కారణాన్ని తరచి చూస్తే.. ‘ఇందు రెబకా వర్గీస్’ తెలుస్తారు? ఎవరీమె? అన్న ప్రశ్నకు సమాధానం వెతికిన తర్వాత.. ఆమె తెలీనందుకు బాధకు గురి కావటమే కాదు.. బరువెక్కిన గుండెతో ‘అమరన్’ సినిమా చూడాలని ఫిక్స్ అయిపోవటం ఖాయం. అంతే కాదు ఆమె గురించి తెలిసిన తర్వాత ఆమె గురుతులు వెంటాడుతూ ఉంటాయి. ఎందుకంటే..?

ముకుంద్ వరదరాజన్ కు మహా మొండివాడిగా పేరుంది. అందరూ అతడి మొండితనాన్ని చూస్తే.. ఇందు మాత్రం అతని మనసును చూసింది. ప్రాణం కన్నా ఎక్కువనుకునే దేశభక్తి.. నలుగురిలో నవ్వులు నింపే మనస్తత్వం.. తోటివారికి సాయపడే ఔదార్యం అతని సొంతం. అందుకే ఆమె.. అతడ్ని స్నేహితుడిగా కాకుండా జీవిత భాగస్వామి అయ్యేందుకు ఆశ పడ్డారు. జీవితాంతం కలిసి నడవాలని భావించారు.అయితే.. అదంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే.. ముకుంద్ తమిళ బ్రాహ్మణ కుటుంబం. ఇందూ కేరళకు చెందిన క్త్రైస్తవ అమ్మాయి. ఇద్దరి పరిచయం మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో జరిగింది. అయితే.. ఇందును ముకుంద్ ఇష్టపడ్డారు. అదే విషయాన్ని ఆమెకు చెప్పారు.

ఆ వెంటనే ఆమె ఓకే చేయటమే కాదు.. ఇంట్లోనూ చెప్పేసింది. ఎప్పటిలానే వ్యతిరేకత వ్యక్తమైంది.అయితే.. అందురు అనుకునే ప్రాంతం.. కులం.. మతం విషయంలో కాదు. అతనికి సైనికుడు అవ్వాలన్న అతడి కెరీర్ ప్లాన్ ఇందు కుటుంబానికి నచ్చలేదు. కూతురికి నో చెప్పారు. వారు ఊహించిందే జరగటంతో.. సమయం కోసం వెయిట్ చేసి.. టైం వచ్చినప్పుడు మళ్లీ చెప్పాలనుకన్నారు. ముకుంద్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో చేరాడు. అయినా.. వారి ప్రేమకు ఎలాంటి ఇబ్బంది కలుగలేదు.

లెఫ్ట్ నెంట్ నుంచి తక్కువ సమయంలోనే కెప్టెన్ అయ్యాడు. ఐదేళ్లు ఓపిగ్గా రెండు కుటుంబాల వారిని ఒప్పించి.. రెండు సంప్రదాయాల్లో పెళ్లి చేసుకున్నారు. వారి అన్యోన్య దాంపత్యానికి గురుతుగా రెండేళ్ల పాప. దాంతో పాటు మేజర్ గా ప్రమోషన్. ఆ తర్వాత రాష్ట్రీయ రైఫిల్స్ కు సెలెక్ట్ అయ్యాడు. పోస్టింగ్ జమ్మూకశ్మీర్ లో. 2014లో ఓ ఆఫరేషన్ లో పాల్గొన్న ముకుంద్.. టీంను నడిపే వేళ పెద్ద ఎత్తున కాల్పులు. తక్షణమే తన వారికి సాయం చేసేందుకు రంగంలోకి దిగిన ముకుంద్.. తీవ్రవాదుల్ని మట్టుపెట్టారు. తన వారిని కాపాడారు. హోరాహోరీగా జరిగిన కాల్పుల తర్వాత విజయంతో బయటకు వచ్చారు. ఆ వెంటనే కుప్పకూలారు. అప్పటివరకు అతడి తోడు ఉన్న వారికి కూడా.. అతడి ఒంట్లో దిగిన బుల్లెట్ల గురించి. తన ప్రాణాలకు తెగించి పోరాడిన వైనానికి అందరూ సెల్యూట్ కొట్టారు.

కేంద్ర ప్రభుత్వం కూడా ఆయనకు అశోక చక్రను ప్రకటించింది. దాన్ని అందుకున్న వేళ.. ఇందు నోటి నుంచి వచ్చిన ఒక మాట అందరిని కట్టిపడేసింది. ‘దేశ ప్రజలు చూడాల్సింది నా బాధను కాదు. ఆయన ధైర్యాన్ని గుర్తించండి’ అంటూ అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఐదేళ్ల వారి వైవాహిక జీవితంలో ముకుంద్ తో కలిసి ఉన్నది కొద్ది నెలలే. ఆయన సరిహద్దుల్లో పోరాడుతుంటే.. ఆమె ఇంటి బాధ్యతను తీసుకున్నారు. భర్త విజయాల్నే తన విజయాలుగా భావించారు. అన్నింటా తోడుగా నిలిచారు. ఇలాంటి ధైర్యం.. ప్రేమ కలిగిన కథను అందరికి పరిచయం చేయాలని దర్శక నిర్మాతలు భావించారు.దానికి ప్రతిరూపమే అమరన్. ఇందులో ఇందు పాత్రను పోషించింది సాయిపల్లవి. తమ వైవాహిక జీవితం గురించి ఇందు నోటి నుంచి వచ్చే ఒక మాట గుండెను బరువెక్కిస్తుంది. అదేమంటే.. ‘మొదట్నించి మాది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్పే. ఇప్పటికీ అలాగే భావిస్తున్నా’ అనే ఆమె మాటలు వెంటాడుతూనే ఉంటాయి. ఆమెకు సెల్యూట్ కొట్టాల్సిందే కదూ?