‘పుష్ప 2’ రిలీజ్ కు ముందు, నాగబాబు ఇంట్రెస్టింగ్ పోస్ట్!

మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ విషయం మీదైనా తనదైన శైలిలో స్పందిస్తూ, వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అయితే ఆయన ఏ పోస్ట్ పెట్టినా కాస్త వెటకారంగా, ఏదో నిగూఢ అర్థం వచ్చేలా, ఎవరినో టార్గెట్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అందుకే అప్పుడప్పుడు కొన్ని పోస్టులు వివాదానికి తెర లేపుతుంటాయి. తాజాగా నాగబాబు ట్విట్టర్ ఎక్స్ వేదికగా పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

“మీరు తప్పు మార్గంలో ఉన్నారని గుర్తిస్తే, వెంటనే మీ తప్పుని సరిదిద్దుకోండి. మీరు ఎంత ఎక్కువ కాలం వేచి చూస్తే, నిజంగా మీరు ఉన్న చోటికి తిరిగి రావడం అంత కష్టం అవుతుంది” అని స్వామి వివేకానంద చెప్పిన కోటేషన్ ను నాగబాబు పోస్ట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాదు, సరికొత్త చర్చకు దారితీసింది. హీరో అల్లు అర్జున్‌ ను ఉద్దేశిస్తూనే నాగబాబు మరోసారి ఇండైరెక్ట్ గా ఈ ట్వీట్‌ చేశారని పలువురు నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.

గత కొంతకాలంగా మెగా Vs అల్లు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఇరు వర్గాల మధ్య తరచుగా ఫ్యాన్ వార్స్ జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాల పర్యటన తర్వాత ఇవి మరీ ఎక్కువ అయ్యాయి. అంతకముందు కేవలం సినిమాల గురించే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునేవారు కానీ, అప్పటి నుంచీ వ్యక్తిగతంగానూ ట్రోల్ చేసుకుంటూ వస్తున్నారు.

అల్లు అర్జున్ తన సన్నిహితుడైన నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి ఇంటికి వెళ్లొచ్చిన తర్వాత, నాగబాబు పెట్టిన ఓ పోస్ట్ అప్పట్లో సంచలనంగా మారింది. ‘మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే’ అంటూ ఆయన ఎక్స్ లో పోస్ట్ పెట్టడం పెద్ద దుమారం రేపింది. కొద్దిసేపటికే ఆ పోస్ట్ డిలీట్ చేసినప్పటికీ, అప్పటికే అది వైరల్ అయింది. ఇదే బన్నీని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేయడానికి జన సైనికులకు, మెగా ఫ్యాన్స్ కు అవకాశం కల్పించింది.

కట్ చేస్తే, అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా డిసెంబర్ 5వ తేదీన విడుదల కాబోతోంది. ఇప్పటికే తెలంగాణలో టికెట్ రేట్లు పెంచుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇంకా రేట్ల పెంపుపై ఏ నిర్ణయం తీసుకోలేదు. పర్మిషన్ కోరుతూ నిర్మాతలు ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకున్నా.. ఇంతవరకూ దీనిపై ప్రభుతం స్పందించలేదని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ఏ మేరకు లభిస్తుందో అనే చర్చ జరుగుతున్న తరుణంలో.. నాగబాబు ట్వీట్ చేయడం హాట్ టాపిక్ అయింది.

‘పుష్ప 2’ రిలీజ్ కు సరిగ్గా మూడు రోజుల ముందు నాగబాబు పోస్ట్ పెట్టడంతో, పరోక్షంగా అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తున్నారనే కామెంట్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. మరోవైపు మెగా బ్రదర్ చేసిన ట్వీట్ కి బన్నీకి ఎక్కడా సంబంధం లేదని, ఆయన గతంలోనూ ఇలా తత్వవేత్తల కొటేషన్స్ పోస్ట్ చేస్తుంటాడని కొందరు అంటున్నారు. ఏదేమైనా మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య దూరం పెరుగుతోందని పుకార్లు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో నాగబాబు ఏ పోస్ట్ పెట్టినా, కొత్త ఊహాగానాలకు తెర లేపుతుండటం గమనార్హం.