ప్రశాంత్ వర్మకి మరో కొత్త టెన్షన్

‘అ!’ మూవీతో దర్శకుడిగా కెరియర్ మొదలుపెట్టిన ప్రశాంత్ వర్మ ఈ ఏడాది ‘హనుమాన్’ చిత్రంతో పాన్ ఇండియా డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఈ సినిమా 300 కోట్లకి పైగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ‘హనుమాన్’ తర్వాత ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ మూవీ స్టార్ట్ చేస్తానని ప్రకటించారు. అయితే హీరో దొరక్క కొద్ది రోజులు అది వాయిదా పడింది. ఎట్టకేలకు రిషబ్ శెట్టి లీడ్ రోల్ లో ‘జై హనుమాన్’ మూవీని ప్రశాంత్ వర్మ కన్ఫర్మ్ చేశారు.

అలాగే బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ తో ఓ సూపర్ హీరో మూవీ ఎనౌన్స్ చేశారు. ఈ సినిమాని అఫీషియల్ గా లాంచ్ చేస్తారనే సమయానికి క్యాన్సిల్ అయ్యిందనే న్యూస్ బయటకి వచ్చింది. క్రియేటివ్ డిఫరెన్స్ వలన ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు రణవీర్ సింగ్ క్లారిటీ ఇచ్చారు. ఇక ‘జై హనుమాన్’ సినిమా బడ్జెట్ పెరగడంతో ‘హనుమాన్’ ని నిర్మించిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ ఈ ప్రాజెక్ట్ వదిలేసుకుంది. దీంతో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించేందుకు ముందుకొచ్చారు.

మరో వైపు నందమూరి బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేసే ఛాన్స్ ని ప్రశాంత్ వర్మ అందుకున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో సూపర్ హీరో కాన్సెప్ట్ తోనే ఈ మూవీ ఉండబోతోందని ప్రకటించారు. మోక్షజ్ఞ కూడా ఈ సినిమా కోసం కంప్లీట్ మేకోవర్ అయ్యి ఫిజికల్ అండ్ మెంటల్ గా సిద్ధం అయ్యాడు. ఇక డిసెంబర్ 5న మూవీ షూటింగ్ మొదలవుతుందనే సమయానికి ప్రాజెక్ట్ వాయిదా పడినట్లు న్యూస్ బయటకొచ్చింది. మోక్షజ్ఞ ఆరోగ్యం బాగోలేకపోవడంతో సినిమా వాయిదా వేశామని, త్వరలో షూటింగ్ స్టార్ట్ చేస్తామని బాలయ్య క్లారిటీ ఇచ్చారు.

అయితే ఎందుకనో ఈ ప్రాజెక్ట్ మీద ఇండస్ట్రీ అనుమాన స్వరాలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ వర్మ, మోక్షజ్ఞ క్రియేటివ్ డిఫరెన్స్ వలన సినిమా హోల్డ్ లో పడిందని అనుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ కానీ క్యాన్సిల్ అయితే అది కచ్చితంగా ప్రశాంత్ వర్మ ఇమేజ్ కి దెబ్బ అవుతుందనే మాట వినిపిస్తోంది. రణవీర్ సింగ్ లాంటి స్టార్ తో ఒక ప్రాజెక్ట్ ఇప్పటికే క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు బాలయ్య కొడుకుతో సినిమా వాయిదా పడిందనే మాట నిజం అయితే ఒకే.

క్యాన్సిల్ అయితే మాత్రం ప్రశాంత్ వర్మకి కొంత ప్రతికూల వాతావరణం ఎదురయ్యే అవకాశం ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు ప్రశాంత్ వర్మకి మెంటల్ టెన్షన్ తప్పదని సినీ విశ్లేషకులు అంటున్నారు.