అల్లు అర్జున్ నటించిన ”పుష్ప 2: ది రూల్” సినిమాపై ఇటీవల సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘హరికథ’ వెబ్ సిరీస్ ఈవెంట్లో “నిన్న కాక మొన్న చూశాం.. వాడెవడో చందనం దుంగల దొంగ.. వాడు హీరో” అంటూ ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియా వైరల్ అయ్యాయి. బన్నీపై సంచలన వ్యాఖ్యలు చేశారంటూ కథనాలు ప్రచారంలోకి రావడంతో, ఈ ఇష్యూపై రాజేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. అల్లు అర్జున్ తన బిడ్డ లాంటోడని, అతనిపై నెగెటివ్ గా మాట్లాడలేదని వివరణ ఇచ్చారు.
రాజేంద్ర ప్రసాద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”ఛీ ఛీ ఛీ.. అల్లు అర్జున్ గురించి నేను నెగిటివ్‌గా మాట్లాడతానా?? అవసరం లేదు.. నేను అలా అంటానా? నా బిడ్డండీ వాడు.. నాకు కొడుకులాంటి వాడు. అల్లు అర్జున్.. ఐ లవ్యూ. ఆ వార్తలు చూసి నాకు నవ్వు వచ్చింది. పోనీలే ఇంత కాలానికి 48 సంవత్సరాలుగా ఎప్పుడూ లేనిది, మనం ఏదో నెగిటివ్‌గా మాట్లాడానని కలర్ ఇచ్చాడు. ఆ రాసిన వాడెవడో తెలిస్తే.. ‘పుష్ప-2లో హీరో దొంగ’ అని నేను అన్నట్టుగా రాసేసాడు. ఓరి పిచ్చనా పుచ్చీ.. నేను అన్న ఉద్దేశం అది కాదు” అని అన్నారు.
”నా ఉద్దేశ్యం ఏంటంటే నేను హీరోగా ఇన్నేళ్ల నుంచి ఉన్నా.. రెగ్యులర్ హీరోని కాదు నేను. ‘లేడీస్ టైలర్’ నుంచి నిన్నగాక మొన్న వచ్చిన ‘కల్కి’ ‘లగ్గం’ వరకూ ఎన్నో సూపర్ హిట్స్ చూశాను. అసలు ఆ ఫంక్షన్లో నేను మాట్లాడింది ఏంటి?.. ‘నేను హీరోనా? ‘లేడీస్ టైలర్’లో నేను హీరోనా? వాడో సన్నాసి. ‘అప్పుల అప్పారావు’ హీరోనా? వాడు వెధవ.. ‘ఏప్రిల్ 1 విడుదల’లో దొంగ.. అంటే ఇలాంటి సమాజంలో మన పక్కనున్న క్యారెక్టర్స్‌ని హీరోగా తీసుకుని, ఆ క్యారెక్టర్ ద్వారానే హీరోగా ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చా”
”ఇవాళ నటుడిగా నాకున్న విశేషం ఏంటంటే.. ప్రతి ఇంట్లోనూ ఒక మంచం, ఒక కంచం ఒక గ్లాసు తప్పేలా ఎలా ఉంటుందో.. రాజేంద్ర ప్రసాద్ సినిమా కూడా అలాగే ఉంటుంది. ఇక్కడే కాదు.. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకూ మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, మనసు బాగోలేనప్పుడు రాజేంద్ర ప్రసాద్ సినిమా చూస్తారు. అలాంటి పరిస్థితుల్లో నేనేదో దొంగ అని అన్నట్లు వాడెవడో రాశాడు. నేను దొంగ అంటే దొంగోడు అయిపోతాడా? పైగా ఎవరు.. అల్లు అర్జున్. నా బిడ్డ లాంటోడు. ఐ లవ్ దట్ ఫెలో. బన్నీ నన్ను పిచ్చగా ప్రేమిస్తాడు. ఎంతగా ప్రేమిస్తాడు అంటే, షూటింగ్ దగ్గర గురువు గారు.. గురువు గారు అంటూ ఉంటాడు”
”జులాయి సినిమా ఈవెంట్ లో గురువు గారు నాకు ఎంతో నేర్పారు అంటూ ఓపెన్ గా చెప్పాడు. అల్లు అర్జున్ జర్నీ చూస్తే.. జులాయి సినిమాకి ముందు, జులాయి తరువాత అని అంటాను. కావాలంటే చెక్ చేసుకోండి తెలిసిపోతుంది. అతను నన్ను ఎంతో ప్రేమిస్తాడు. అతను నన్ను ఎంత లవ్ చేస్తాడనేది నేను మాటల్లో చెప్పలేను. నేను కూడా అంతే లవ్ చేస్తాను. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపుములో’ సినిమాలు కలిసి చేశాం. ‘అల వైకుంఠపుములో’ ఓ రేంజ్ సినిమా. అతని పెర్ఫార్మన్స్.. మేమిద్దరం డిస్కస్ చేసుకునేవాళ్లం”
”పుష్ప సినిమాకి నేషనల్ అవార్డ్ వచ్చినప్పుడు గురువు గారూ.. నాకు అవార్డ్ వచ్చింది గురువు గారూ అంటూ చెప్పాడు. చాలా సంతోషపడ్డాను. మనం చేసే క్యారక్టర్ ని మనం కన్విన్స్ చేయగలిగితే, అవతలి వాళ్ళు ఎవరైనా కన్విన్స్ అవుతారు. వాడెవడో అజ్ఞానంతో అమాయకత్వంతో నన్ను నెగిటివ్ సైడ్ తీసుకెళ్లాలని చూసినా.. మీరు పొరపాటున కూడా వెళ్లొద్దు” అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అసలు ‘పుష్ప 2’ లాంటి సినిమా తీయడం ఎవడి వల్ల అవుతుందండీ?. పైగా అది ‘నాన్నకు ప్రేమతో’ సుకుమార్ తీసిన సినిమా. వాళ్లిద్దరూ కలిసి మామూలు సినిమా చేసారా?. ఎవరు పడితే వాళ్ళు ‘పుష్ప’ లాంటి సినిమా చేయమనండి.. చూస్తాను. అది అసాధ్యం.. ఎవడివల్లా కాదు. వాళ్లిద్దరూ నిజంగానే సాధించారు అని అన్నారు.
”నేషనల్ అవార్డ్ మీరనుకున్నంత ఈజీ కాదు. అది కొట్టాలంటే ఎంత ప్రిపరేషన్ ఉండాలి.. ఆరోజున ఎంత సంతోషపడిపోయాం. అందరం అర్జున్ ని పైకి ఎత్తేసాం. హ్యాట్సాఫ్ అల్లు అర్జున్.. నువ్వు ఇంకా ఎన్నెన్నో గొప్ప విషయాలు చేయాలని కోరుకుంటున్నాను. ఇండియాలోనే కాదు, ప్రపంచమంతా అతని గురించి గొప్పగా మాట్లాడుకుంటుంటే.. నేను లైక్ చేయకుండా ఎలా ఉంటాను అండీ. వాడెవడో చాలా తక్కువ ఆలోచించాడు. మెచ్యూరిటీ లెవల్స్ లేవు. నా గురించి తెలిసినవాళ్ళు అయితే అలా రాయరు. కాబట్టి నన్ను కూడా మీలో ఒక వ్యక్తిగా చూడండి. అల్లు అర్జున్.. ఐ లవ్ యూ” అని రాజేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు.