టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ సరైన హిట్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన తన అప్ కమింగ్ మూవీ రాబిన్ హుడ్ పై గట్టి నమ్మకం పెట్టుకున్నారు. ఎలా అయినా మంచి హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే నితిన్, వెంకీ కుడుముల కాంబోలో వచ్చిన భీష్మ సూపర్ సక్సెస్ అందుకోవడంతో.. రాబిన్ హుడ్ కూడా అలరిస్తుందని అంతా అంచనా వేస్తున్నారు.
యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాపై ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. క్రిస్మస్ కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. రిలీజ్ కు టైమ్ దగ్గరపడుతున్న వేళ.. ఒక్కసారిగా ప్రమోషన్స్ ఆగిపోయాయి. సినిమా రిలీజ్ వాయిదా పడుతుందని కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.
ఓవైపు సినిమా వర్క్ పెండింగ్ ఉంది!.. మరోవైపు పుష్ప-2 దూసుకుపోతోంది.. దీంతో క్రిస్మస్ కు రిలీజ్ చేస్తే వసూళ్లపై ప్రభావం పడుతుందనే కారణంతో పోస్ట్ పోన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నితిన్ మాత్రం.. క్రిస్మస్ కే సందడి చేయాలని పట్టుబట్టినా.. వాయిదా వేయడం తప్పలేదని సమాచారం. అయితే పోస్ట్ పోన్ సరే.. మరి రాబిన్ హుడ్ రిలీజ్ ఎప్పుడనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సంక్రాంతి కానుకగా రాబిన్ హుడ్ ను రిలీజ్ చేయనున్నారని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది.
జనవరి 13వ తేదీన విడుదల చేయనున్నారని తెలుస్తోంది. అయితే సంక్రాంతికి ఇప్పటికే మూడు సినిమాలు ఫిక్స్ అయ్యాయి. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలయ్య డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు.. ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇప్పుడు రాబిన్ హుడ్ కూడా రానున్నట్లు తెలుస్తోంది.
అయితే రాబిన్ హుడ్ కాకుండా మిగతా మూడు చిత్రాల్లో రెండు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నవే. మరొకటి నాగవంశీ రూపొందిస్తున్నారు. ఇప్పుడు తానేం తక్కువ అన్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ కూడా రాబిన్ హుడ్ తో సంక్రాంతికి వచ్చేస్తుందన్నమాట. అయితే నిజానికి మైత్రీ సంస్థ..
అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీతో పొంగల్ కు సందడి చేద్దామనుకుని ఇప్పటికే ఫిక్స్ అయింది. కానీ ఆ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు రాబిన్ హుడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోందట. థియేటర్ల విషయంలో కాస్త పోటీ ఉన్నా.. ఇప్పటికే అజిత్ మూవీ కోసం మైత్రీ సంస్థ లాక్ చేసి ఉంచిందని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు అవి రాబిన్ హుడ్ కు దక్కుతాయని సమాచారం. పుష్ప-2 కూడా తమదే కాబట్టి..
ఆ మూవీ ఎగ్జిబిటర్స్ కూడా సపోర్ట్ చేస్తారు. కాబట్టి రాబిన్ హుడ్ మూవీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంక్రాంతికి రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎప్పుడూ దిల్ రాజు వర్సెస్ మైత్రీ అనేలా పోటీ ఉంటుండగా.. ఇప్పుడు సంక్రాంతికి కూడా అదే పరిస్థితి కనిపించనుంది. అదే సమయంలో రాబిన్ హుడ్ కంటెంట్ పై కూడా మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. మరి ఆ మూవీ పొంగల్ కు వచ్చి ఎలాంటి హిట్ అందుకుంటుందో వేచి చూడాలి.