అందుకే విఘ్నేష్‌ ఫోటోలు షేర్‌ చేయను : నయన్‌

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార గత కొన్ని రోజులుగా ధనుష్‌తో వివాదం కారణంగా వార్తల్లో ఉంటున్న విషయం తెల్సిందే. డైరెక్ట్‌గా ధనుష్‌ను ఆమె తీవ్ర పదజాలంతో విమర్శించారు. మరో వైపు తన అనుమతి లేకుండా నయనతార డాక్యుమెంటరీలో తన సినిమా విజువల్స్‌ను వినియోగించారు అంటూ ధనుష్ కోర్టును ఆశ్రయించారు. కాపీ రైట్‌ యాక్ట్‌ కింద ఏకంగా రూ.10 కోట్లకు దావా వేసిన ధనుష్‌పై నయనతార దంపతులు రెగ్యులర్‌గా ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేయడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఒక ఇంటర్వ్యూలో నయనతార ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఈ మధ్య కాలంలో విఘ్నేష్‌ శివన్‌తో కలిసి దిగిన ఫోటోలను షేర్‌ చేయడం లేదు. అందుకు కారణం ఏంటి అంటూ రిపోర్టర్‌ అడిగిన సమయంలో నయన్‌ స్పందిస్తూ… ఈ మధ్య తాను విఘ్నేష్‌తో కలిసి దిగిన ఫోటోలను షేర్‌ చేస్తే కొందరు నెటిజన్స్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. వాటికి ఎక్కువగా నెగటివ్‌ కామెంట్స్ వస్తున్న కారణంగానే తాను విఘ్నేష్‌తో కలిసి దిగిన ఫోటోలను షేర్‌ చేయడం లేదని నయనతార చెప్పుకొచ్చింది. సోషల్‌ మీడియాలో గతంలో విఘ్నేష్‌తో కలిసి దిగిన ఫోటోలను ఎక్కువగా షేర్‌ చేసిన నయనతార ఈమధ్య కాలంలో భర్తతో కలిసి దిగిన ఫోటోలను అస్సలు షేర్ చేయడం లేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఇక తన ప్రతి సినిమా విజయాన్ని సొంతం చేసుకోవడం పట్ల నయనతార సంతోషం వ్యక్తం చేసింది. ఆమె ఈ విషయమై మాట్లాడుతూ తనను అందరు హీరోల అభిమానులు అభిమానిస్తారు. అందరి అభిమానం వల్లే తన సినిమాలు విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. ప్రతి సినిమా విజయాన్ని సొంతం చేసుకోవడంలో అభిమానుల ప్రోత్సాహం ఉందని నయనతార చెప్పుకొచ్చింది. నయనతారను ప్రతి ఒక్కరు అభిమానిస్తారు, అందుకే ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నాయి.
లేడీ సూపర్‌ స్టార్‌గా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకు పోతున్న నయనతార తల్లి అయిన తర్వాత సైతం సినిమాల విషయంలో తగ్గడం లేదు. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు మాత్రమే కాకుండా హీరోయిన్‌గా మంచి కమర్షియల్‌ సినిమాలను సైతం చేస్తోంది. తెలుగులో ఈమె ఒక స్టార్‌ హీరో సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హిందీ నుంచి జవాన్‌ తర్వాత ఈమెకు మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఈమె మాత్రం ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటుంది.