ఎట్టకేలకు గూఢచారి స్పందించాడు..!

అడవి శేష్‌ హీరోగా దాదాపు ఆరు ఏళ్ల క్రితం వచ్చిన ‘గూఢచారి’ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాకి మంచి స్పందన లభించింది. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆ ఫ్రాంచైజీలో వరుసగా సినిమాలు చేయాలని అడవి శేష్‌ భావించాడు. అందుకోసం ఇప్పటికే రెండో పార్ట్‌ను ప్రకటించాడు. గూఢచారి 2ను ప్రకటించాడు. సినిమా ప్రకటన వచ్చి చాలా కాలం అయ్యింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్‌ లేకపోవడంతో అసలు ఏం అయ్యింది అంటూ గూఢచారి ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో ప్రశ్నించారు.

ఎట్టకేలకు గూఢచారి నుంచి స్పందన వచ్చింది. నేడు అడవి శేష్‌ బర్త్‌ డే సందర్భంగా సోషల్‌ మీడియా ద్వారా గూఢచారి 2 సినిమా యొక్క పోస్టర్‌ను విడుదల చేశారు. గన్ పట్టుకుని స్టైలిష్ లుక్‌లో ఉన్న అడవి శేష్‌ లుక్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. గూఢచారి అనే పదంకు అతను అన్నట్లుగా సోషల్‌ మీడియాలో ఈ ఫోటోకు కామెంట్స్ వస్తున్నాయి. రెండో గూఢచారిని చూడటం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం అంటూ ఆయన ఫ్యాన్స్‌తో పాటు రెగ్యులర్ ప్రేక్షకులు సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గూఢచారి 2 సినిమాకు వినయ్‌ కుమార్‌ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌తో పాటు అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మొదటి పార్ట్‌తో పోల్చితే గూఢచారి 2 సినిమా భారీగా ఉంటుందని, అంతే కాకుండా కథ విషయంలో పరిధి పెద్దగా ఉంటుంది అంటూ మేకర్స్‌ చెబుతున్నారు. షూటింగ్‌ ఆగిపోయింది అంటూ వచ్చిన వార్తలు నిజం కాదని త్వరలోనే సినిమా నుంచి టీజర్‌ను విడుదల చేసి వచ్చే ఏడాది సమ్మర్‌ లేదా ఆ తర్వాత విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మరో వైపు అడవి శేష్‌ డకాయిట్‌ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలో హీరోయిన్‌గా మొదట శృతి హాసన్‌ను ఎంపిక చేయడం జరిగింది. కొన్ని రోజుల షూటింగ్‌ జరిగింది. అయితే ఏదో కారణాల వల్ల శృతి హాసన్‌ను ఆ ప్రాజెక్ట్‌ నుంచి తప్పించారు. ఆ సినిమాలో కొత్తగా మృణాల్ ఠాకూర్ వచ్చి జాయిన్‌ అయ్యింది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఏడాది గ్యాప్‌ ఇచ్చినందుకు గాను గూఢచారి 2, డకాయిట్‌ సినిమాలు బ్యాక్ టు బ్యాక్‌ వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండు సినిమాలపైనా అంచనాలు భారీగా ఉన్నాయి. అడవి శేష్‌ చాలా విలక్షణ హీరో అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఆయన సినిమాల కోసం ఫ్యాన్స్‌తో పాటు ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తారు.