మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ స్వీయ దర్శకత్వంలో రూపొందించి నటించిన ‘బరోజ్’ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 3డి వర్షన్‌లో భారీ ఎత్తున విడుదల కాబోతున్న బరోజ్ సినిమాకు మలయాళంలో భారీ క్రేజ్ హైప్ ఉన్నాయి. కానీ తెలుగులో మాత్రం బరోజ్ సినిమా గురించి కనీసం చర్చ జరగడం లేదు. ఇదే తీరుతో సినిమా విడుదల అయితే కనీసం ప్రేక్షకులు థియేటర్ దారి పట్టే అవకాశం లేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు తెలుగులో రిలీజ్ చేయబోతుండటం కాస్త కలిసి వచ్చే అవకాశం.
మోహన్‌లాల్‌కి తెలుగులో మంచి గుర్తింపు ఉంది. ఆయన నటించిన తెలుగు సినిమాలు ఉన్నాయి, అలాగే ఆయన ఇతర భాషల్లో నటించగా డబ్ అయిన సినిమాలు తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇన్ని సినిమాలతో ఇక్కడ కూడా సూపర్ స్టార్ హోదాతో మోహన్‌లాల్‌కి గౌరవం ఉంది అనడంలో సందేహం లేదు. ఆయన మంచి సినిమాతో వస్తే తెలుగు ప్రేక్షకుల బ్రహ్మరథం పడుతారు. ఇప్పుడు బరోజ్ సినిమాతో కచ్చితంగా ఆయన తెలుగులోనూ విజయాన్ని అందుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఎంత పెద్ద సినిమాను చేసినా ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లడంకు ప్రమోషన్ అవసరం. ఆ ప్రమోషన్ ను బరోజ్ యూనిట్ సభ్యులు తెలుగు రాష్ట్రాల్లో అంతగా చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. కానీ మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ముందుకు వచ్చిన నేపథ్యంలో కచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పుష్ప 2 వంటి బిగ్గెస్ట్ హిట్‌ను సొంతం చేసుకున్న మైత్రి వారు ఇప్పుడు బరోజ్ సినిమాతో రాబోతున్నారు అనే ప్రచారం కారణంగా ఆ సినిమాకు మెల్ల మెల్లగా బజ్ క్రియేట్ అవుతోంది అంటూ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
పిల్లల సినిమాగా ప్రచారం జరుగుతున్న బరోజ్ సినిమా మోహన్‌లాల్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్ సినిమాగా నిలిచింది. చాలా కాలంగా ఈ సినిమా వాయిదాలు పడుతూ వస్తోంది. టెక్నికల్‌గా ఈ సినిమా భారీ వ్యాల్యూస్‌తో రాబోతుంది. దాదాపు రెండేళ్ల ఎదురు చూపుల తర్వాత రాబోతున్న బరోజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావంను చూపిస్తుంది అనేది చూడాలి. మలయాళం, తమిళ్‌లో బరోజ్‌కి మంచి బజ్ ఉన్నా తెలుగులో మాత్రం కేవలం మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేస్తున్న కారణంగా బరోజ్‌కి బజ్ క్రియేట్ అయ్యింది. మరి మైత్రి వారి సాయంతో బరోజ్ సినిమాకు మంచి వసూళ్లు నమోదు అయ్యేనా అనేది చూడాలి.