సినీ ఫక్కీలో 26కోట్లు వసూలు..! సీనియర్ నటి జయచిత్ర కుమారుడు అరెస్టు

సీనియర్‌ నటి జయచిత్ర కుమారుడు అమ్రేష్‌ ను చెన్నై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. చెన్నైలోని వలసరవాక్కంకు చెందిన నెడుమారన్‌ అనే వ్యక్తిని రైస్‌ పుల్లింగ్‌ పేరుతో 26 కోట్లకు మోసం చేసాడనే ఆరోపణలతో అమ్రేష్ ను అరెస్ట్ చేశారు. దీంతో కోలీవుడ్ ఒక్కసారిగా షాక్ అయింది. రెండేళ్ల క్రితం సత్యదేవ్ హీరోగా వచ్చిన ‘బ్లఫ్‌మాస్టర్‌’ సినిమాలో రైస్‌ పుల్లింగ్‌ ఎపిసోడ్‌ తరహాలోనే అమ్రేష్ మోసానికి పాల్పడ్డాడని తెలుస్తోంది.

దాదాపు 8 ఏళ్ల నుంచి రైస్‌ పుల్లింగ్‌ పేరుతో అమ్రేష్‌ తన స్నేహితులతో కలిసి నెడుమారన్ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రైస్‌ పుల్లింగ్‌ కలశం ఇంటిలో ఉంటే.. ప్రపంచాన్నే గెలవొచ్చని నెడుమారన్ ను మోసం చేసినట్టు తెలుస్తోంది. రైస్‌ పుల్లింగ్‌ కలశం వల్ల ఎటువంటి మార్పులు లేకపోవడంతో నెడుమారన్‌ సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అమ్రేష్‌, అతని సన్నిహితుల్ని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది.