‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’ వంటి విలక్షణమైన హిట్ చిత్రాల్లో నటించి, హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు అడివి శేష్. సినిమా ఎంత పెద్ద విజయం సాధించింది అనేదానికన్నా ఎంత గుర్తింపు సంపాదించుకుందనేదాన్నే ఎక్కువగా పట్టించుకుంటాడాయన. తాజాగా అతడు సుమంత్, నందిత శ్వేతల కపటధారి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యాడు. ట్రాఫిక్ ఎస్సై వేషం కట్టిన శ్యామల ఇప్పటివరకు ఎన్ని చలాన్లు కట్టావంటూ కూపీ లాగింది. దీంతో అడ్డంగా దొరికిపోయిన అడివి శేష్ అసలు విషయాన్ని చెప్పక తప్పలేదు.
డ్రింక్ అలవాటు లేదు కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఎప్పుడూ పట్టుబడలేదని, అయినా ఆరు చలానాలు పడ్డాయని తెలిపాడు. ఈ మధ్యే ఆర్‌ఆర్‌ఆర్ దగ్గర ఆపి తన ఆరు చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పి కట్టించుకునేవరకు వదల్లేదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా సినిమా మేజర్ సినిమాలో నటిస్తున్నాడు. 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలర్పించిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఇండియా నిర్మిస్తోంది. శోభితా దూళిపాళ్ల, ప్రకాశ్ రాజ్, సయీ మంజ్రేకర్, రేవతి, మురళీ శర్మ తదితరులు నటిస్తున్నారు.