‘అసురన్’ మేకర్స్ తో అల్లు అర్జున్..!

‘అల వైకుంఠపురములో’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్.. ఇప్పుడు ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా వైడ్ క్రేజ్ కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇకపై అన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేయాలని డిసైడైన బన్నీ.. ఏఆర్ మురగదాస్ – బోయపాటి శ్రీను – కొరటాల శివ – ప్రశాంత్ నీల్ వంటి స్టార్ డైరెక్టర్స్ ను లైన్ లో పెట్టాడు. ఈ క్రమంలో ప్రముఖ తమిళ నిర్మాత ఎస్.థాను నిర్మాణంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయనున్నాడని తెలుస్తోంది.

వి క్రియేషన్స్ బ్యానర్ పై కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఎస్.థాను.. ‘తుపాకి’ ‘పోలీసోడు’ ‘కబాలి’ ‘అసురన్’ ‘కర్ణన్’ వంటి చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం వెంకటేష్ తో ‘నారప్ప’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయడానికి చర్చలు జరుపున్నామని.. త్వరలోనే ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చుతుందని ఆశిస్తున్నానని థాను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘మగధీర’ తమిళ వెర్షన్ విడుదల విషయంలో అల్లు అరవింద్ కు సహాయం చేసిన థాను.. ‘మాపిళ్ళై’ సినిమా నుంచి మెగా ప్రొడ్యూసర్ తో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

దీనిని బట్టి చూస్తే బన్నీ – ఏ.ఆర్ మురుగదాస్ కాంబోలో రూపొందనున్న ప్రాజెక్ట్ కు ఎస్.థాను నిర్మాతగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘తుపాకి’ చిత్రాన్ని ఎస్.థాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇది మురగదాస్ సినిమానా లేదా మరో కొత్త మూవీనా అనే దానిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.