పుష్పరాజ్ భార్య నారప్పలో ప్రియమణి అంత మాసా!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న `పుష్ప-డ్యూయాలజీ` పై భారీ అంచనాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. బన్నీని నటుడిగా మరో మెట్టు పైకి ఎక్కించే ఫ్రాంఛైజీగా నిలిచిపోతుందని అభిమానులు బలంగా విశ్వసిస్తున్నారు. స్టైలిష్ టిఫికల్ ఫిలిం మేకర్ సుకుమార్ పుష్ప చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా కేటగిరీలో బహుభాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. తెలుగు- తమిళం- మలయాళం- కన్నడం- హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు.

రెండు భాగాల ఫ్రాంచైజీలో మొదటి భాషం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ నేపథ్యంలో పార్ట్ -1 ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో బన్నీ ఎర్రచందనం స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నారు. ఇక గిరిజన యువతి పాత్రలో రష్మిక కనిపించనుందని యూనిట్ రివీల్ చేసింది. ఇప్పటికే ఈ రెండు పాత్రల ఫస్ట్ లుక్ లు ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా సినిమాకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. ఈ చిత్రంలో వివాహిత గా గృహిణిగా రష్మిక కనిపించనుందిట. అంటే పుష్పరాజ్- రష్మిక భార్యాభర్తలుగా కనిపిస్తారన్నమాట. అయితే సినిమా ప్రారంభం నుంచి ఇద్దరిని భార్యా.. భర్తలుగా చూపిస్తారా? లేక కొంత లవ్ ట్రాక్ నడిచిన తర్వాత పెళ్లి చేసుకుని ఒకటవుతారా? అన్నది తెలియాల్సి ఉంది.

అలాగే ఇద్దరి మధ్య ఇంటిమేట్ సన్నివేశాలు మాస్ ఆడియన్ కి కనెక్ట్ అయ్యేలా సుకుమార్ స్టైల్లో ఉంటాయని సమాచారం. ఇప్పటికే ఇద్దరి పాత్రల స్వరూపం ఎలా ఉంటుందన్నది లుక్స్ రూపంలో బయటపడింది. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు కూడా అంతే హైలైట్ గా ఉంటాయని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. పూర్తిగా చిత్తూరు మాండలికంలో నే రెండు పాత్రలు మాట్లాడుతాయి. ఆ శైలికి ఎంత మాత్రం తగ్గకుండా మాస్ కోణంలో ఆద్యంతం పాత్రలు రక్తికట్టిస్తాయని తెలుస్తోంది. ఇటీవలే రిలీజైన నారప్ప చిత్రంలో నెల్లూరు-చిత్తూరు యాస ప్రేక్షకాభిమానుల్ని ఆకట్టుకుంది. పుష్పలో ఈ యాస పాళ్లు మరింత అదనపు ఆకర్షణ కానున్నాయని అర్థమవుతోంది. ముఖ్యంగా నాయకానాయికలే చిత్తూరు యాసతో అదరగొట్టడం ఫ్యాన్స్ కి ఓ రేంజులోనే కనెక్ట్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రష్మిక పాత్రను నారప్పలో ప్రియమణి పాత్రలా ఊహించుకోవచ్చన్నమాట.

దసరా లేదా డిసెంబర్ లో?

అక్టోబర్ 13న దసరా కానుకగా ఆర్.ఆర్.ఆర్ ని రిలీజ్ చేసేందుకు జక్కన్న శాయాశక్తులా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ సమయంలో దసరా టార్గెట్ పెట్టుకుని బన్ని బరిలో దిగిపోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో మహేశ్ ని టార్గెట్ పెట్టుకుని ఎలాగైనా `అలవైకుంఠపురములో` సినిమాని `సరిలేరునీకెవ్వరు`ని మించి హిట్ చేయాలని ట్రై చేసిన బన్నీ ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. 2020 సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద బన్ని సిసలైన విన్నర్ గా నిలిచాడు. ఇప్పుడు కూడా అంతకుమించి అంటున్నాడు. అసలు తగ్గేదేలే అంటూ పుష్ప చిత్రాన్ని ఆర్.ఆర్.ఆర్ కి పోటీగా దించేందుకు టార్గెట్ పెట్టుకున్నాడట. ఒకవేళ దసరా మిస్సయితే క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో పుష్ప 1 రిలీజయ్యే ఛాన్సుంది. సంక్రాంతి 2022 బరిలో తీవ్రమైన పోటీ కారణంగా పుష్పను సోలో రిలీజ్ చేసేందుకే ఛాన్సుంటుందని అంచనా. బహుభాషల్లో భారీ వసూళ్లను తేవాలంటే బన్ని సోలో రిలీజ్ కి వెళితేనే బావుంటుందని ట్రేడ్ వర్గాలు కూడా విశ్లేషిస్తున్నాయి.