అతడిని చుట్టుముట్టి ఆల్మోస్ట్ తన్నబోయిన ఫ్యాన్స్


టీవీ సీరియల్ చూస్తూ ఎమోషనల్ అయ్యి విలన్ ని తిట్టేస్తూ ఒక్కోసారి కన్నీళ్లు పెట్టుకున్న బాపతు టీవీక్షకులను చాలామందిని చూశాం. కొన్నిసార్లు టీవీ రంగం సినీరంగంలో విలన్లు ఆరుబయటికి వస్తే ఫ్యాన్స్ గుర్రుగా చూసే వాతావరణం ఉంటుంది. ఇలాంటి ఎమోషన్ల విషయంలో కొన్ని వీడియో సాక్ష్యాలు కూడా బయటపడ్డాయి. సినిమాలో విలన్ ని రోడ్ పైకి వస్తే అటకాయించిన ప్రబుద్ధులు లేకపోలేదు. మావాడిని కాళ్లతో అలా తంతావా? అంటూ ఎమోషన్ అయ్యే మాస్ అభిమానులు కొన్నిసార్లు కనిపిస్తుంటారు. ఇదంతా మాసిజం.. ఇంకా ఈ తరహా అమాయక ఫ్యాన్స్ లేకపోలేదు.

అభిమానుల ప్రేమకు హద్దులు లేవు. క్రేజ్ అర్థం చేసుకోలేనిది. తమ ఫేవరెట్ హీరోకి పాలాభిషేకం పూజలు పునస్కారాలు చేయాలన్నా అభిమాన హీరోని కలిసేందుకు చెప్పులు లేకుండా వందల కిలోమీటర్లు నడవాలన్నా.. తమ ప్రేమను ప్రదర్శించడానికి ఏ రేంజుకు అయినా వెళ్లే వాళ్లనే నిజమైన ఫ్యాన్స్ అంటారు. అయితే రీల్ కి రియాలిటీకి మధ్య తేడా ఏంటో వీళ్లంతా కనిపెట్టలేకపోతున్నారా? అంటే అలాంటిదేమీ లేదు. ఆ క్షణం అలా ఎమోషన్ అయిపోతుంటారు.

జూనియర్ ఆర్టిస్ట్ ఉజ్జయిని శంకర్ కి అలాంటి ఒక అనుభవం ఎదురైంది. రెగ్యులర్ గానే పెద్ద తెరపై నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో కనిపించే ఉజ్జయిని శంకర్ కి ఓసారి థియేటర్ లో ఒక భయంకరమైన అనుభవం ఎదురైందట. తాజాగా అతడు దానిని గుర్తుచేసుకున్నాడు.

అతడు థియేటర్ కి వెళుతుండగా..మహేష్ బాబు అభిమానులు తనను చుట్టుముట్టి ఫలానా సన్నివేశంలో మహేష్ బాబుపై తిరగబడడానికి ఎంత ధైర్యం? అంటూ నిలదీశారట. అతడు లోనికి వెళుతుంటే అభిమానులు అడ్డు పడ్డారు. దాంతో చాలా భయపడ్డాడని చెప్పాడు. ఆల్మోస్ట్ తనని తన్నేంతవరకూ పరిస్థితి వచ్చిందని కూడా ఉజ్జయిని అన్నాడు.

ఇది కేవలం మహేష్ అభిమానుల నుంచి ఎదురయ్యే సన్నివేశమే కాదు. చాలా మంది స్టార్ల అభిమానుల నుంచి కొందరికి ఇలాంటివి ఎదురైన సందర్భాలున్నాయి. ఒక విలన్ పాత్ర ఎంతగా కనెక్టయ్యింది..! అన్నది కూడా బయటపడే సందర్భం ఇదేనన్నమాట.