అమ్మ రాజశేఖర్ రూ.6 కోట్ల ఇల్లు విషయం అడిగిన నాగార్జున

మూడు రోజుల క్రితం బిగ్ బాస్ ఎపిసోడ్ లో మార్నింగ్ మస్తీలో భాగంగా అవినాష్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. లాక్ డౌన్ లో ఇంటి లోను కట్టలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. ఇంటి ఈఎంఐ కట్టలేక చాలా ఇబ్బంది పడ్డానంటూ అవినాష్ బాధ పడ్డ సమయంలో అంతా కూడా అతడిని ఓదార్చారు. ఆ తర్వాత అమ్మ రాజశేఖర్ కిచెన్ లో ఆ విషయం గురించి మళ్లీ మాట్లాడుతూ ఈఎంఐ కట్టలేక ఆత్మహత్య చేసుకోవడం ఏంట్రా నేను రూ.6 కోట్ల ఇల్లును వదిలేశాను అంటూ ఫ్లోలో చెప్పేశాడు. ఆ సమయంలో అమ్మ రాజశేఖర్ ఎందుకు అంత ఇల్లు అమ్మేశాడు అని అంతా అనుకున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో రాజశేఖర్ నుండి నాగార్జున ఆ ప్రశ్నకు సమాధానం రాబట్టాడు.

నోయల్ నామినేషన్ చేసిన సమయంలో ఆయన వివరణ వినేందుకు మీరు ఒప్పుకోక పోవడం ఏమాత్రం కరెక్ట్ కాదన్న నాగార్జున అదే సమయంలో అవినాష్ విషయంలో మీరు మాట్లాడిన తీరు నాకు నచ్చిందని అమ్మ రాజశేఖర్ ను అభినందించాడు. ఆత్మహత్య చేసుకోవడం ఏంట్రా మళ్లీ ఆ మాట అంటే చంపేస్తానంటూ మీరు అతడిని హెచ్చరించడం నాకు చాలా బాగా నచ్చిందని నాగార్జున అన్నారు. ఆ సమయంలోనే మీరు ఆరు కోట్ల ఇల్లు అమ్మేశాను అన్నారు కాద ఎందుకు అంటూ నాగ్ ప్రశ్నించారు.

మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఆమె ఆ ఇంట్లో జారి కింద పడి పోయారు. ఆమె సంవత్సరం పాటు ఆసుపత్రిలో ఉన్నారు. అప్పుడే ఆ ఇల్లు సరిగా లేదు కలిసి రావడం లేదు తీసేయమని అమ్మ అన్నప్పుడు నేను ఆరు కోట్ల ఇంటిని అమ్మేశాను. ఆ సమయంలోనే ఏడాది పాటు అమ్మతో ఉండటం వల్ల నాకు సినిమాల్లో ఆఫర్లు తగ్గాయని రాజశేఖర్ మాస్టర్ అన్నారు.