అంటే.. బాపు జంధ్యాల మార్క్ సుందరానివా గురూ?


బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్రకటిస్తూ హీరోలంతా స్వింగులోకి వస్తున్నారు. ఇప్పుడు నాని వంతు. నేచురల్ స్టార్ ప్రస్తుతం `టక్ జగదీష్` షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అలాగే టాక్సీవాలా దర్శకుడితో శ్యామ్ సింఘరాయ్ ఇప్పటికే నానీ క్యూలో ఉంది. ఉన్నట్టుండి ఇంతలోనే మరో సినిమాని ప్రకటించి షాకిచ్చాడు నాని. ఈ సినిమా టైటిల్ బాపు జంధ్యాల మార్కులో పెద్ద వంశీ ఎంపికలా ఆకట్టుకుంది. `అంటే సుందరానికీ!` అంటూ ఆశ్చర్యార్థకంతో టైటిలే ఎంతో ఫన్నీగా ఆకర్షిస్తోంది.

బాపు-రమణల రైటింగ్ టింజుతో పెద్ద వంశీ ఐడియాలజీతో జంధ్యాల రేంజులో ఈ సినిమాని తెరకెక్కిస్తారా? అన్న సందేహం కలగక మానదు తాజాగా రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ వీక్షిస్తుంటే. డీసెన్సీ లేక ఇటీవల ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన కామెడీ అంతరించినట్టయ్యింది. దీంతో అలాంటి సినిమా చూడాలనుకునే ఔత్సాహికులకు సరైన అవకాశమే లేకుండా పోయింది. సడెన్ గా నాని ప్రత్యక్షమై ఈ పోస్టర్ తో పాత జ్ఞాపకాల్ని తిరగతోడారు. తాజా పోస్టర్ చూస్తుంటే ఆ రేంజు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఈ చిత్రానికి `బ్రోచెవరేవరురా` ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించనున్నారు. మూవీ కర్టెన్-రైజర్ వీడియోను తాజాగా నిర్మాతలు విడుదల చేశారు. ఈ పోస్టర్ లో కథానాయకుడు నాని పంచె కట్టు గెటప్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒక రకంగా బారిస్టర్ పార్వతీశమ్ ను పోలిన గెటప్ ఇది. అతడి పక్కనే ట్రాలీ సూట్ కేస్ .. ఆవకాయ జాడీలు.. సైకిల్ .. షూస్ .. ఆ లుక్ లోనే బోలెడంత పరమార్థం దాగి ఉంది. ఆ ఫోజుకి స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వాలి మరి.

ఈ చిత్రానికి భారిస్టర్ పార్వతీశం నవల ఆధారమా కాదా? అంటే.. కేవలం పోస్టర్ లో కొంత పోలిక మాత్రం కనిపిస్తోంది. ఏ విషయమూ చిత్రబృందం ప్రకటించాల్సి ఉంటుంది. రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభించి 2021 లో రిలీజ్ చేయాలన్నది ప్లాన్.ట్యాలెంటెడ్ నజ్రియా ఫహద్.. రాజా రాణి ఈ చిత్రంలో నానీతో రొమాన్స్ చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ బ్యానర్ లో నాని ఇదివరకూ గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించారు. ఇదే బ్యానర్ లో రెండో చిత్రమిది.