అరియానాకు ఓటేయ‌మ‌ని ఆర్జీవీ పిలుపు

తెలుగు బిగ్‌బాస్ చ‌రిత్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కు అమ్మాయి విన్న‌ర్‌గా నిలిచింది లేదు. రెండో సీజ‌న్‌లో గీతా మాధురి, మూడో సీజ‌న్‌లో శ్రీముఖి గెలుపు అంచుల వ‌ర‌కూ వెళ్లిన‌ప్ప‌టికీ చివ‌రికి ర‌న్న‌ర‌ప్‌తోనే స‌రిపెట్టుకున్నారు. కానీ ఈసారి ఎలాగైనా బిగ్‌బాస్ ట్రోఫీని వ‌శం చేసుకుంటామ‌ని హౌస్‌లో అడుగు పెట్టింది అరియానా. బ‌య‌ట జీవితంలో లాగే ఇక్క‌డా ఆమె ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంది. ఎవ‌రి స‌పోర్ట్ లేకుండా ఒంట‌రిగా పోరాడుతూ ప‌ద్నాలుగో వారానికి చేరుకుంది. ఈ ఒక్క వారం ఎలిమినేష‌న్ గండం నుంచి త‌ప్పించుకుంటే నేరుగా ఫైన‌ల్‌కు చేరుకుంటుంది. ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల ఓట్ల‌ను త‌న వైపు తిప్పుకునేందుకు బిగ్‌బాస్ ఇచ్చే టాస్కుల‌ను రెట్టించిన ఉత్సాహంతో పూర్తి చేస్తోంది. అలా “అధికారం” టాస్కులో అంద‌రినీ మెప్పించి ఉత్త‌మ‌ మ‌హారాణిగా ఎంపికైంది.

ఇక నిన్న‌టి “స‌హ‌నం” టాస్కులోనూ ఆమె ముందు త‌న ప్రాణ‌మైన బొమ్మ‌ను న‌లిపేస్తున్నా ఉద్వేగాన్ని లోలోప‌లే అణుచుకుంటూ చ‌ల‌నం లేకుండా, ఎలాంటి ఎక్స్‌ప్రెష‌న్స్ లేకుండా శిలావిగ్ర‌హంలా ఉండిపోయింది. టాస్క్ పూర్తైన త‌ర్వాత మాత్ర‌మే త‌న ఎమోష‌న్ అంతా బ‌య‌ట‌కు క‌క్కేసింది. అయితే ఈ వారం నామినేష‌న్‌లో ఉన్న ఆమెను ర‌క్షించేందుకు బోల్డ్ పాప అభిమానులు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. వీరికి సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ అండ‌గా నిల‌బ‌డ్డారు. అరియానాకు ఓటేసి గెలిపించాల‌ని ప్ర‌చారానికి దిగారు. బిగ్‌బాస్ ట్రోఫీ గెలిచేందుకు అరియానాకే అర్హ‌త ఉంద‌ని బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెప్తున్నారు. ఆర్జీవీ స‌పోర్ట్ దొర‌క‌డంతో అరియానా ఫ్యాన్స్ తెగ సంతోష‌ప‌డుతున్నారు. ఇక ఆమె బ‌య‌ట‌కొచ్చాక సినిమా తీయ‌డానికీ సిద్ధ‌మేన‌ని వ‌ర్మ ఈ మ‌ధ్యే ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పిన విష‌యం తెలిసిందే!