ఆనందయ్య మందు: జగపతిబాబుపై బాబు గోగినేని సెటైర్లు


ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరినీ భయపెడుతున్నది ఒక్కటే .. అదే కరోనా. అయితే ఈ కరోనాకు మందు లేదు. టీకా ఒక్కటే మార్గం. కానీ అదీ అందుబాటులో లేదు. దీంతో ప్రజలకు కానకష్టమవుతోంది. కానీ ఏపీలోని కృష్ణపట్నంలో వెలిసిన ఆనందయ్య మందు కరోనాను నివారించడంలో పనిచేస్తోందన్న ప్రచారం జోరుగా సాగింది. ప్రభుత్వం నిర్ధారించి అనుమతించింది.ఓ పక్క కరోనాకు విరుగుడుగా.. సంజీవనిగా ఆనందయ్య మందును లక్షలాది మంది భావిస్తుంటే.. మరోవైపు హేతువాది బాబు గోగినేని లాంటి వారు మొదటి నుంచి దీని శాస్త్రీయత లేదంటూ వ్యతిరేకిస్తున్నారు.

ఆనందయ్య మందుకు టాలీవుడు నటుడు జగపతి బాబు సంపూర్ణ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎవరు నమ్మినా.. నమ్మకపోయినా నేను నమ్ముతున్నా అంటూ జగపతిబాబు ఆనందయ్య మందును స్వయంగా స్వీకరించారు. ప్రజలను కాపాడడానికి ఆనందయ్య మందు రూపంలో మనముందుకు ప్రకృతి వచ్చింది. ఆయుర్వేదంతో హాని లేదు. ప్రపంచాన్ని అదే కాపాడుతుంది అని జగపతి బాబు గతంలో పోస్ట్ చేశారు. ఆనందయ్యను ఆశీర్వదించాలని కోరారు. ఈ నేపథ్యంలో జగపతి బాబును టార్గెట్ చేస్తూ బాబు గోగినేని వ్యంగ్యంగా ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ చేశాడు.

బాబు గోగినేని పోస్ట్ చేస్తూ ‘‘అమ్మ నాటీ! తమరు దుకాణం తెరవబోతున్నట్టు చెప్పకుండా ఆనందయ్య చట్నీ గుణగణాలు మెచ్చుకుంటూ మాట్లాడటం భలే బిజినెస్ టాక్టిక్ యాక్టర్ గారూ. కానీ తెలివైనవాడు ఎవడైనా కొంచం ఆగి చెప్పేవాడు. ఈ ఆత్రం మనకే చేటు.’’ అంటూ జగపతిబాబుపై బాబు గోగినేని సెటైర్లు వేశారు.