సెప్టెంబర్ నుండే బాలయ్య హంగామా.!

వరస ప్లాపుల్లో ఉన్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో ఉన్నాడు. అందుకోసమే తన ఫెవరెట్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో జతకట్టాడు. సింహా, లెజండ్ తర్వాత మరో పవర్ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసాడు బోయపాటి. ఈ చిత్ర మొదటి షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈలోగా లాక్ డౌన్ కారణంగా షూట్ లు వాయిదా పడిన విషయం తెల్సిందే. ఇటీవలే బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ అందరినీ ఇంప్రెస్ చేసింది. ముఖ్యంగా అందులో బాలయ్య చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ను సెప్టెంబర్ లో మొదలుపెట్టాలని టీమ్ భావిసున్నట్లు తెలుస్తోంది. అప్పటికి కేసులు కూడా తగ్గే అవకాశాలు ఉండడంతో షూటింగ్ ను నిరవధికంగా కొనసాగించాలని భావిస్తున్నారు. సెప్టెంబర్ నుండి డిసెంబర్ దాకా షూటింగ్ ను పూర్తి చేసి వీలయితే జనవరిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు.

థమన్ ఎస్ ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా కొత్తమ్మాయిని తీసుకున్నారు. ఆమె ఎవరో, ఏమిటో సమయం వచ్చినప్పుడు రివీల్ చేస్తామని దర్శకుడు బోయపాటి శ్రీను తెలిపారు.