తమిళనాడు కొత్త గవర్నర్ గా ఆ కేంద్ర మంత్రి?

తమిళనాడుకు కొత్త గవర్నర్ రాబోతున్నారు. ప్రస్తుత గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ పదవీకాలం మరో రెండు నెలల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో అక్కడ కొత్త గవర్నర్ ను నియమించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్న రవిశంకర్ ప్రసాద్ పేరు గట్టిగా వినిపిస్తోంది. బీజేపీ సీనియర్ నేత ఓ.రాజగోపాలన్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తున్నా.. ప్రస్తుతం ఆయన వయసు 90 ఏళ్లు దాటడంతో రవిశంకర్ ప్రసాద్ కే చాన్స్ వస్తుందని సమాచారం. రవిశంకర్ ప్రసాద్ గతంలో జయలలితకు న్యాయ సలహాదారుగా వ్యవహరించారు. ఆమె బాగా నమ్మిన వ్యక్తుల్లో ఒకరు. ఈ నేపథ్యంలో రవిశంకర్ కొత్త గవర్నర్ గా రానుండటం దాదాపు ఖాయమైందని అంటున్నారు.

ప్రస్తుత గవర్నర్ పురోహిత్ పదవీకాలం ఈ ఏడాది ఆగస్టులో పూర్తికానుంది. ఆయన పదవీకాలం పొడిగింపునకు కేంద్ర సుముఖంగా లేదని చెబుతున్నారు. మరోవైపు త్వరలో ఏడు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు. సర్వానంద్ సోనోవాల్, సుశీల్ మోదీ, వరుణ్ గాంధీ, అనుప్రియా పటేల్, జ్యోతిరాదిత్య సింధియా వంటివారికి అవకాశం రానుందని అంటున్నారు. పలువురు కేంద్ర మంత్రులకు ఆ బాధ్యతలను తొలగించి పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని చెబుతున్నారు.