బండ్ల ‘మార్కు’ ట్విస్ట్: ప్రకాష్ రాజ్.. మింగలేక కక్కలేక.!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికలకు సంబంధించి గత కొంతకాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు తెలుగు నాట అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. పూర్తిగా వెయ్యి మంది సభ్యులు కూడా లేని ఓ అసోసియేషన్ ఎన్నికల కోసం ఎందుకింత హంగామా.? అంటే, అది సినీ పరిశ్రమకు సంబంధించిన నటీ నటులకు సంబంధించిన అసోసియేషన్ గనుక.. అనే సమాధానం వస్తుంది. చిరంజీవి ఎవరికి మద్దతిస్తారు.? దాన్ని ఎవరు వ్యతిరేకిస్తారు.? ఇలా నడుస్తోంది చర్చ.

చిరంజీవి మాత్రం, ఎందుకు ఎవరికైనా ‘ఔట్ రేటెడ్’ మద్దతు ఇచ్చేస్తారు.? అన్న ఇంగితం లేకపోవడమే ఇంత రచ్చకు కారణం. సినీ పరిశ్రమలో కోట్లు ఆర్జించే నటీనటులున్నారు. కానీ, ‘మా’ కోసం ఓ భవనాన్ని కట్టుకోలేకపోయారు. ఇది నిజానికి, సదరు అసోసియేషన్‌కే కాదు, మొత్తంగా సినీ పరిశ్రమకు అవమానం. ఎందుకు అది జరగలేదు.? అన్నది వేరే చర్చ. ఈసారి ఎన్నికల్లో అదే కీలకమైన అంశం కాబోతోందనుకోండి.. అది వేరే అంశం.

ఇక, ప్రకాష్ రాజ్ ప్యానల్ అందరికన్నా ముందు ఎన్నికల నగారా మోగించేసింది. అధికారికంగా మోగాల్సిన నగారాకి సంబంధించి చాలా హైడ్రామా నడిచింది.. చివరికి నగారా మోగింది. ఇంతలోనే చాలా మార్పులు. అధ్యక్ష పదవికి పోటీ పడతామని గతంలో ప్రకటించిన హేమ, జీవిత.. ఇటీవల, ప్రకాష్ రాజ్ ప్యానల్‌లో చేరిపోయారు. దాంతో, అప్పటిదాకా ప్రకాష్ రాజ్ వెంట వున్న బండ్ల గణేష్.. సూపర్ షాక్ ఇచ్చాడు.

జీవిత, ప్రకాష్ రాజ్ ప్యానెల్‌లోకి వచ్చి పోటీ చేయడం తనకు నచ్చలేదనీ, ఆమెపై తాను పోటీకి దిగుతున్నాననీ ప్రకటించేశాడు. జీవిత గతంలో చిరంజీవిపైనా, పవన్ కళ్యాన్‌పైనా చేసిన విమర్శల్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానన్నది బండ్ల గణేష్ వాదన. నిజానికి, ఇది చాలా సిల్లీ రీజన్. పవన్ కళ్యాణ్‌ని విమర్శించినవారిలో ప్రకాష్ రాజ్ కూడా వున్నారు. మరి, అధ్యక్ష పదవికే బండ్ల పోటీ చేయొచ్చ కదా.?

ఇక, ఈ మొత్తం వ్యవహారంపై ప్రకాష్ రాజ్ పరిస్థితి మింగలేక.. కక్కలేక అన్నట్టు తయారైంది. ఆల్రెడీ ‘నాన్ లోకల్’ సమస్యను ప్రకాష్ రాజ్ ఎదుర్కొంటున్నాడు. మరోపక్క, మెగా కాంపౌండ్ కూడా ప్రకాష్ రాజ్ తీరు పట్ల కొంత అసహనంతో వుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో, ఎన్నికల నాటికి ‘మా’ రాజకీయాలు మరిన్ని ట్విస్టులతో సాధారణ ఎన్నికల్ని తలపించే అవకాశం లేకపోలేదనే చర్చ సినీ పరిశ్రమలో జోరుగా సాగుతోంది.