గత ఏడాది వచ్చిన అల వైకుంఠపురంలో సినిమా సెన్షేషనల్ సక్సెస్ అయ్యింది. ఆ సినిమాలోని పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్బుత విజయాన్ని సొంతం చేసుకుంది. అల వైకుంఠపురంలో సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయిన నేపథ్యంలో మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది అనడంలో సందేహం లేదు. ఆ సినిమా తర్వాత థమన్ నుండి వస్తున్న ప్రతి సినిమాను.. పాటను అంతకు మించి ఉండాలి అన్నట్లుగా అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం థమన్ చేస్తున్న రెండు ప్రధాన చిత్రాలు సర్కారు వారి పాట మరియు భీమ్లా నాయక్. ఈ రెండు సినిమాల్లోని పాటల పై ఆయా హీరోల అభిమానులు ఓ రేంజ్ లో అంచనాలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. తాజాగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం భీమ్లా నాయక్ పాటలపై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందుతోంది.
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ కాంపౌండ్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం భీమ్లా నాయక్ సినిమాకు సంబంధించినంత వరకు థమన్ సంగీతం అద్బుతంగా వచ్చిందట. బన్నీ అల వైకుంఠపురంలో సినిమా కు ఎలా అయితే మంచి మ్యూజిక్ ను థమన్ అందించాడో అలాగే ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమాకు కూడా మంచి సంగీతాన్ని అందించాడు అంటూ వారు చెబుతున్నారు. పాటల రికార్డింగ్ దాదాపుగా పూర్తి అయ్యాయట. సినిమా యూనిట్ సభ్యులు అంతా కూడా పాటల విషయంలో చాలా ఇంప్రెస్ అయ్యారని తెలుస్తోంది. థమన్ మరోసారి ది బెస్ట్ ఇచ్చాడని.. అల వైకుంఠపురంలో మాదిరిగానే మరోసారి మా బ్యానర్ లో ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలుస్తుందని వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
భీమ్లా నాయక్ లో పాటలకు స్కోప్ తక్కువగా ఉంటుంది. అయినా కూడా ఉన్నంతలో అన్ని పాటలను కూడా చక్కగా తనదైన శైలిలో థమన్ మంచి మాస్ మ్యూజిక్ తో అందించాడని తెలుస్తోంది. రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ తో అల వైకుంఠపురంలో ఇప్పటికి కూడా టాప్ లో ఉండగా.. వాటిని బ్రేక్ చేసే విధంగా భీమ్లా నాయక్ పాటలు ఉంటాయనే నమ్మకంను పవన్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న సర్కారు వారి పాటకు సంబంధించిన పాటలపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ఏడాది దసరాకు సర్కారు వారి పాట నుండి మొదటి పాటను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.