ఇప్పుడు అందరి చూపు భీమ్లా.. వైపు

దేశ వ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇంయన్ బాక్సాఫీస్ వద్ద భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ సంక్రాంతికి భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీస్ థియేటర్లలో సందడి చేయాలని ఫిక్సయ్యాయి. అయితే కేవలం ఒక్క రోజు లోనే పరిస్థితులన్నీ తారుమారైనట్టుగా కనిపిస్తోంది. ఈ సంక్రాంతికి వారం ముందే పండగ వాతావరణాన్ని తీసుకురావాలని `ఆర్ ఆర్ ఆర్` మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు.

భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాల్ని కూడా నిర్వహించారు. బాలీవుడ్ లో వారం పాటు మాకాం పెట్టి అక్కడ ఏ మీడియా అందు బాటులో వుంటే ఆ మీడియాని `ఆర్ ఆర్ ఆర్` ప్రమోషన్స్ని హోరెత్తించారు. చివరికి ప్రో కబడ్డీ ని కూడా `ఆర్ ఆర్ ఆర్` ప్రమోషన్స్ కోసం వాడేశారు. దీంతో ఈ సినిమాకు కనీ వినీ ఎరుగని పబ్లిసిటీ వచ్చేసింది. దేశ వ్యాప్తంగా ఈ సినిమా పై చర్చ కూడా మొదలైంది.

ఎప్పుడెప్పుడు జనవరి 7 వచ్చేస్తుందా అని ఆసక్తిగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్న వేళ పిడుగులాంటి వార్త..`ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ వాయిదా పడే అవకాశం వుందని ప్రచారం జోరందుకుంది. అయితే అంతకు ముందు ఈ సినిమా రిలీజ్ సమయంలో పోటీకి వుండకూడదని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించి పవర్ ప్యాక్డ్ యాక్షన్ డ్రామా `భీమ్లా నాయక్` ని తప్పించిన విషయం తెలిసిందే.

ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులు పలు దఫాలుగా మీటింగ్ లు కండక్ట్ చేసి ఫైనల్ గా జనవరి 12న విడుదల కావాల్సిన `భీమ్లా నాయక్` నివాయిదా వేయించారు. అయితే దేశ వ్యాప్తంగా కోవిడ్ ఒమిక్రాన్ రూపంలో ముంచుకొస్తున్న నేపథ్యంలో `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ ని వాయిదా వేళ అందరి చూపు ఇప్పుడు `భీమ్లా నాయక్` పై పడింది.

`ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ కారణంగా ఈ మూవీని ముందు అనుకున్న జనవరి 12 నుంచి తప్పించి ఫిబ్రవరి 25కు వాయిదా వేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో ముందు అనుకున్న డేట్ కే `భీమ్లా నాయక్` ని సంక్రాంతి బరిలోకి దింపేయండని ఇండస్ట్రీ వర్గాలు మేకర్స్ కి చెబుతున్నాయి. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో `ఆర్ ఆర్ ఆర్` విడుదల వాయిదా తో బంతి ఇప్పుడు `భీమ్లా నాయక్` కోర్టుకి చేరింది.

అయితే బ్యాలెన్స్ వర్క్ వుండటం పవన్ విదేశాల్లో వుండటంతో మేకర్స్ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. పవన్ నిర్మాతలు కోరినట్టే విదేశాల నుంచి తిరిగొచ్చి బ్యాలెన్స్ షూటింగ్ ని పూర్తి చేస్తాడా? .. `భీమ్లా నాయక్` జనవరి 12నే థియేటర్లలో సందడి చేస్తాడా? అన్నది తెలియాలంటే మేకర్స్ ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.

ఇందులో పవన్ కు జోడీగా నిత్యామీనన్ నటించిన విషయం తెలిసిందే. రానా కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సాగర్ కె. చంద్ర తెరకెక్కించారు. సంయుక్త మీనన్ .. రానాకు జోడీగా నటించింది. తమన్ సంగీతం అందించిన ఈ చిత్ర గీతాలు ఇప్పటికే నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాయి.