బిగ్‌బాస్ నాల్గో సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్లలో మోస్ట్ ఎట్రాక్షన్ పర్సన్ ఎవరయా అంటే అది గంగవ్వ మాత్రమే! ఈ వయసులో అవ్వ ఏం చేయగలదు అనుకునేవాళ్లకు ఆమె జర్నీ చెంపెట్టు సమాధానం. ఆమె హుషారును ఎవరూ అందుకోలేకపోయారు. ఆమె కామెడీని ఎవరూ బీట్ చేయలేకపోయారు. ఆమె పంచ్‌లకు రివర్స్ పంచ్ అనేదే లేకుండా పోయింది. కల్మషం లేని మనసుతో ముసుగు లేకుండా ఆడిన గంగవ్వకు పిల్లల నుంచి పెద్దల వరకు అంతా అభిమానులే. దేశవిదేశాల్లో ఉన్న ఎంతోమంది తెలుగువాళ్లు కేవలం అవ్వ కోసమే బిగ్‌బాస్ షో చూసేవారు.
గంగవ్వకు ఇల్లు కట్టిస్తానని నాగ్ హామీ
అంతటి ఆదరణ పొందిన ఈ యూట్యూబ్ స్టార్ కొత్తిల్లు కట్టుకోవాలన్న ఆశయంతో బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టింది. తన కలుపుగోలుతనంతో అందరితో ఇట్టే కలిసిపోయింది. అందరి మీద ఉన్న చనువుతో వారిపై సరదాగా పంచులేస్తూ, వాళ్లతో కలిసి డ్యాన్సులు చేస్తూ ఎంతగానో అలరించింది. కానీ అనారోగ్య కారణాల వల్ల అయిదో వారంలోనే హౌస్ నుంచి నిష్క్రమించింది. ఆమె కల కలగానే మిగిలిపోకూడదన్న భావనతో నాగార్జున తన చెల్లెలికి మంచి ఇల్లు కట్టిస్తానని ఆ బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. ఈ మాటలతో ఆమె మనసు ఖుషీ అయింది. గుండె నిండా ఆనందంతో ఇంటి నుంచి వీడ్కోలు తీసుకుంది.
ఫ్యాషన్ షోలో రూ.లక్ష గెలుచుకున్న అవ్వ
అయితే హౌస్‌లో అవ్వ ఓ స్పెషల్ టాస్క్ గెలిచింది. చందన బ్రదర్స్ ఫ్యాషన్ షోలో అమ్మాయిలు, అబ్బాయిలు ర్యాంప్ వాక్‌పై నడిచారు. ఇందులో అబ్బాయిలు గంగవ్వను విజేతగా ప్రకటించారు. ఆమెకు లక్ష రూపాయల గిఫ్ట్ వోచర్ అందించారు. ఆ చెక్కుతో బంగారం కొనాలా? బట్టలు కొనాలా? అన్న సందిగ్ధంలో ఊగిసలాడిన అవ్వ ఎట్టకేలకు ఓ నిర్ణయానికి వచ్చింది. బంగారం కొనుగోలు చేసేందుకు తాజాగా హైదరాబాద్‌కు వచ్చింది. లక్ష రూపాయల చెక్కుతో రెండు తులాల బంగారం కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఈ మేరకు వీడియోను అవ్వ తన ఛానల్లో పోస్ట్ చేసింది. అలాగే త్వరలోనే గంగవ్వ తన ఇంటి నిర్మాణం వీడియోను కూడా వదలనున్నట్లు తెలుస్తోంది.