బిగ్ బాస్ సీజన్ 5 లో ఫ్యామిలీ టాస్క్ జరుగుతోన్న విషయం తెల్సిందే. మొన్న కాజల్ భర్త, కూతురు వచ్చి ఆమెను ఎమోషనల్ చేసారు. వాళ్ళు రావడంతో కాజల్ కొంత కంఫర్ట్ గా ఫీలైంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ముందుగా శ్రీరామ్ చంద్ర సిస్టర్ వచ్చారు. ఆమె అందరితో సరదాగా మాట్లాడారు. అలాగే శ్రీరామ్ తో నువ్వు బాగా ఆడుతున్నావు, విన్నర్ గా చూడాలని ఉంది, గొడవలు పెట్టుకో కానీ దాన్ని ఎక్కడ కట్ చేయాలో తెలుసుకో అని మంచిగా చెప్పారు.
ఇక కంటెస్టెంట్స్ ఒకవైపు తమకు కావాల్సిన వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురుచూడటం, బిగ్ బాస్ ఇచ్చే ఆదేశాలను పాటించడంతో ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతోంది. కంటెస్టెంట్స్ మధ్య ప్లే, పాజ్, రివైండ్, లూప్ వంటి ఆదేశాలు మంచి ఫన్ ను జెనరేట్ చేస్తున్నాయి.
మానస్ తల్లిగారు వచ్చి హౌజ్ లో చాలా సందడి చేసారు. కంటెస్టెంట్స్ అందరిపై పంచుల వర్షం కురిపించారు. శ్రీరామ్ చంద్ర తనకు, మానస్ కు ఒకేసారి పెళ్లి చేసేయండి అని అడిగితే నీకు హమీద ఉంది కదా అని సరదాగా వేసిన పంచ్ భలే పేలింది. కాజల్ మీకు టీ పెట్టనా అని అడిగితే నీకు వంట రాదు కదా అని పంచ్ వేశారు. ఇలా అందరితో సరదాగా గడిపి వెళ్లిపోయారు.
వారి తర్వాత సిరి వాళ్ళ తల్లి గారు హౌజ్ లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. అయితే ఆమె వస్తూ వస్తూనే షణ్ముఖ్, సిరి మంచి ఫ్రెండ్స్ అవ్వడం బాగుంది కానీ హగ్ చేసుకోవడం అస్సలు నచ్చలేదు అని అందరి ముందూ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేయడం అనేది అంత ఈజీగా తీసుకోలేకపోయారు. షణ్ముఖ్ అయితే బాగా డల్ అయిపోయాడు. ఆమె వెళ్తూ కూడా షణ్ముఖ్, సిరి మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారు కానీ అలా హగ్ చేసుకోవడం బాలేదని అనేసి వెళ్లిపోయారు. దీని వల్ల షణ్ముఖ్ గేమ్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో చూడాలి. ఎందుకంటే అలా చెప్పి వెళ్లినా కూడా సిరి షణ్ముఖ్ ను హగ్ చేసుకుంది కానీ షణ్ముఖ్ దూరంగానే ఉంటున్నాడు.
ఇక రేపు మిగిలిన కంటెస్టెంట్స్ ల కుటుంబ సభ్యులు హౌజ్ లోకి వస్తారు. ఇంకా షణ్ముఖ్, సన్నీ, రవి, ప్రియాంక మిగిలి ఉన్నారు.