బాలీవుడ్ హిట్ మూవీ పింక్ ను తమిళంలో అజిత్ హీరోగా బోనీకపూర్ రీమేక్ చేసిన విషయం తెల్సిందే. నేర్కొండ పార్వై టైటిల్ తో రూపొందిన ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. వంద కోట్లకు పైగా సినిమా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో వాలిమై సినిమాను చేస్తున్నారు. బోనీ కపూర్ వరుసగా మూడవ సినిమాను అజిత్ తో నిర్మించేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది.
వినోద్ దర్శకత్వంలో అజిత్ హీరోగా బోనీ కపూర్ నిర్మించబోతున్న సినిమాకు సంబంధించిన స్ర్కిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యింది. త్వరలోనే సినిమాను అధికారికంగా ప్రకటించబోతున్నారు. మూడవ సినిమా అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అజిత్ తో వరుసగా మూడవ సినిమా చేస్తున్న బోనీ కపూర్ ఈ సినిమాతో మరో వంద కోట్లను దక్కించుకోవడం ఖాయం అంటున్నారు. వరుసగా బాలీవుడ్ లో సినిమాలు నిర్మించే అవకాశం ఉన్నా కూడా ఈయన కోలీవుడ్ లో ఈయన సినిమాను చేయడం అజిత్ తో ఉన్న సన్నిహిత్యంగా చెప్పుకోవచ్చు. వీరిద్దరి కాంబోలో ముందు ముందు మరిన్ని సినిమాలు వస్తాయేమో చూడాలి.