‘లైగర్’ న్యూడ్ ఫోటోపై సెలబ్రిటీల ప్రశంసలు.. నెటిజన్ల ట్రోల్స్..!


సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ”లైగర్”. పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ ఫిలింగా పిలవబడుతున్న ఈ సినిమా నుంచి లేటెస్టుగా ఓ బోల్డ్ పోస్టర్ రిలీజ్ చేయబడింది. ఇందులో వీడీ ఒంటి మీద ఎలాంటి డ్రెస్ లేకుండా కేవలం గులాబీలను అడ్డుగా పెట్టుకొని నిలబడి ఉన్నాడు. అయితే ఈ ఫోటోకి మిశ్రమ స్పందన లభించింది.

‘లైగర్’ న్యూడ్ పోస్టర్ పై అనేక మంది సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించారు. ఎందరో ఈ ఫోటోని తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్ట్ చేసారు. అనుష్క శెట్టి – సమంత – పూజా హెగ్డే – రష్మిక మందన్నా – జాన్వీ కపూర్ వంటి పాపులర్ హీరోయిన్లు ఈ పిక్ పై కామెంట్స్ చేస్తూ విజయ్ దేవరకొండ ని కొనియాడారు.

సమంత ఇన్స్టాగ్రామ్ లో VD ఫోటోని షేర్ చేస్తూ.. ‘అతనికి రూల్స్ తెలుసు కాబట్టి.. వాటిని అతనే బ్రేక్ చేయగలడు. ధైర్యం మరియు కీర్తి అతని సొంతం. లైగర్ దేవరకొండ’ అని కామెంట్ చేసింది. ‘మేము బాలీవుడ్ కి చాలా ప్రత్యేకమైన వ్యక్తిని పొందాము. అది విజయ్ దేవరకొండ. లైగర్ త్వరలో రాబోతుంది’ అని జాన్వీ పేర్కొంది.

‘మా JGM గ్యాంగ్ కి గుడ్ లక్. లైగర్ సినిమా కోసం వేచి ఉండలేను’ అని పూజా హెగ్డే పోస్ట్ చేసింది. రష్మిక మందన్నా ట్వీట్ చేస్తూ.. ”నాకు ఇన్స్పిరేషన్ ఎవరు అని అడిగితే.. ఎప్పుడూ ఎవరినీ ఎంచుకోలేదు.. కానీ ఈరోజు విజయ్ దేవరకొండని అని చెప్తాను. లైగర్ నీకు మా ప్రేమ మరియు మద్దతు ఉంటుంది.. దేశానికి చూపించండి.. కాదు కాదు ప్రపంచానికి నువ్వు ఏమి చేయగలరో అది చూపించు. ఆల్ ది బెస్ట్” అని పేర్కొంది.

అయితే సాధారణ ప్రేక్షకులు మాత్రం విజయ్ దేవరకొండ న్యూడ్ స్టిల్ పై పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. యాంటీ ఫ్యాన్స్ మరియు వ్యతిరేక వర్గం వంటి వారు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. ఇందులో విజయ్ బాక్సర్ గా కనిపిస్తారు అంటే.. ఇలా బాక్సర్ లేకుండా చూపిస్తారని అనుకోలేదని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.

“నేను ఈ సినిమా కోసం సర్వస్వం అర్పించాను.. నటనలో మానసికంగా శారీరకంగా నా మోస్ట్ ఛాలెంజింగ్ రోల్” అని విజయ్ ట్వీట్ చేశారు. సర్వస్వం ఇవ్వడం అంటే బట్టలు కూడా ఇచ్చేయడమేనా అని మరో నెటిజన్ సెటైర్ వేశారు. సంపూర్ణేష్ బాబు క్యాలీ ప్లవర్ అడ్డు పెట్టుకొని అసెంబ్లీ ముందు నిలబడితే.. ఇక్కడ వీడీ గులాబీ గుచ్చాన్ని అడ్డుపెట్టుకుని రోడ్డుపై నిలబడ్డాడని ట్రోల్ చేస్తున్నారు.

ఈ పోస్టర్ పై ఇప్పుడు వెలకొలదీ మీమ్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో ఓ నెటిజన్ విజయ్ దేవరకొండ న్యూడ్ ఫోటోను ఎడిట్ చేసి ప్యాంటు ధరించినట్లు ఫొటో రెడీ చేసాడు. దీనికి విజయ్ ను ట్యాగ్ చేస్తూ.. నాకు తర్వాత థాంక్స్ చెప్పు బ్రదర్ అని కామెంట్ పెట్టాడు. దీనికి వీడీ స్పందిస్తూ.. ‘సకాలంలో ఆదుకునే బ్రదర్ నువ్వే’ అని రిప్లై ఇచ్చాడు.

ఏమైనా ఇలా నగ్నంగా ఫోటోలు షేర్ చేయాలంటే ఎంతో ధైర్యం కావాలి. ఆ విషయంలో విజయ్ దేవరకొండ ను మెచ్చుకొని తీరాల్సిందే. ఇలాంటివి తనకే సాధ్యమని వీడీ నిరూపించారు. ఈ ఫోటో గురించి సోషల్ మీడియాలో చర్చలు జరగడంతో.. ‘లైగర్’ సినిమాకు భారీ ప్రచారం లభించిందనేది వాస్తవం.

ఇదిలా ఉంటే ‘లైగర్’ న్యూడ్ ఫోటో ట్రోల్స్ పై చిత్ర బృందం స్పందించింది. కొన్ని అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లేదా అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్ షిప్ లలో పాల్గొనబోయే ఫైటర్ల బరువును కొలవడానికి ఇలానే న్యూడ్ గా ఉంటారని తెలిపారు. బాక్సర్ల బరువును గ్రామ్ లలో కొలవడానికి ఒంటిమీద నూలు పోగు కూడా ఉంచరని.. ఈ లీగ్స్ ను ఫాలో అయ్యే వారికి ఇది బాగా తెలుస్తుందని అన్నారు. అలాంటి నేపథ్యంలో వచ్చే సినిమా కాబట్టి సింబాలిక్ గా ఈ పోస్టర్ ను అలా డిజైన్ చేశామని ‘లైగర్’ టీమ్ వివరణ ఇచ్చింది.