తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘రాజీనామా’ ప్రస్తావన తెరపైకి తెచ్చారు. ఆ పార్టీకే చెందిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇప్పటికే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేసిన విషయం విదితమే. అయితే, ఈ విషయమై కనీసం చంద్రబాబుతో గంటా చర్చించలేదు. చాలాకాలంగా పార్టీకి దూరంగా వుంటున్న గంటా, సరైన సమయం చూసుకుని విశాఖ ఉక్కు పేరుతో తుక్కు రాజీనామా చేసేశారు. గంటా సంగతి పక్కన పెడితే, ఈ రోజు విశాఖలో పర్యటించిన చంద్రబాబు, విశాఖ ఉక్కు లేకపోతే, విశాఖ లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నిజమే, విశాఖ ఉక్కు పరిశ్రమ.. విశాఖతో అంతలా మమేకమైపోయింది.. విశాఖకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెట్టింది కూడా. అయితే, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో చంద్రబాబు పాత్ర తక్కువేమీ కాదు. చంద్రబాబు ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 13 జిల్లాల ఆంధ్రపదేశ్‌కి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ కాలంలో ఎప్పుడూ విశాఖ ఉక్కు పరిశ్రమకు ప్రత్యేకంగా గనులు కేటాయించాలన్న డిమాండ్ చంద్రబాబు తెరపైకి తీసుకురాలేదు. చంద్రబాబు సంగతి పక్కన పెడితే, వైసీపీ చిత్తశుద్ధిపైనా చాలా అనుమానాలున్నాయి. ఎటూ టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలలో చాలామంది వైసీపీలోకి దూకేయడం, గంటా పార్టీకి దూరంగా వుండడం.. ఈ పరిస్థితుల్లో ఉక్కు పరిశ్రమ పేరుతో రాజీనామా అస్త్రాన్ని ప్రయోగిస్తే, రాజకీయంగా టీడీపీకి ఊపు వస్తుందని చంద్రబాబు భావిస్తున్నట్లున్నారు.
విశాఖ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలా.? నాతో సహా ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలా.? ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా చేయాలా.? మీరెలా చెబితే అలా.. మేం అన్నిటికీ సిద్ధం.. అని ఇప్పుడు చెబుతున్న చంద్రబాబు, ప్రత్యేక హోదా కోసం ఎందుకు ఇలాంటి కీలక నిర్ణయం ప్రకటించలేదట.? ఇదీ చంద్రబాబు చిత్తశుద్ధి.