చంద్రబాబు ఫ్రస్ట్రేషన్: తప్పదు, జనం తిరగబడాల్సిందే.!

ఓ నాయకుడి మీదనో, ఓ పార్టీ మీదనో జనం తిరగబడటం కాదు.. మొత్తంగా వ్యవస్థలోని లోటుపాట్లపై జనం తిరగబడాలి. తిరగబడటమంటే, ఇంకో అర్థంలో కాదు. వ్యవస్థలో మార్పుకోసం నడుం బిగించాల్సిందే. ‘ఏం, దుర్గమ్మ సాక్షిగా అవినీతి జరుగుతోంటే ప్రజలు స్పందించరా.? ఓటు కోసం వెయ్యి, రెండు వేలు ఇస్తే సరిపెట్టుకుంటారా.? మీ పొరుగున వున్న రాజధాని కోసం మీరు నినదించరా.?’ అంటూ విజయవాడలో కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో చంద్రబాబు, ప్రజల మీద విరుచుకుపడిపోయారు.

ప్రజలు తిరగబడాల్సిందే.! కానీ, ఎవరి మీద.? కాస్త చరిత్రలోకి తొంగి చూస్తే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మద్దతిచ్చిందెవరో అర్థమవుతుంది. మొట్టమొదటి ‘అనుకూల లేఖ’ టీడీపీ నుంచే వచ్చింది. ఆ తర్వాత అదే చంద్రబాబు, ‘విభజన అన్యాయం, అక్రమం, దుర్మార్గం’ అన్నారు. ప్రత్యేక హోదా విషయానికొస్తే, ‘హోదా కావాల్సిందే.. అందుకోసమే బీజేపీతో పొత్తు’ అని ఇదే చంద్రబాబు చెప్పారు. కానీ, ఏమయ్యింది.? అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదాని చంద్రబాబే పాతరేసేశారు. ‘ప్రత్యేక హోదాతో ఏమొస్తుంది.? ప్రత్యేక హోదా దండగ’ అన్నారు. అంతేనా, హోదా కోసం ఉద్యమిస్తే, జైలుకు పోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

మళ్ళీ అదే చంద్రబాబు, ప్రత్యేక హోదా పేరుతో నాటకానికి తెరలేపి, ‘నాకు రక్షణగా నిలబడండి..’ అంటూ జనాన్ని వేడుకున్నారు. పెద్దగా తేడా ఏం లేదు చంద్రబాబుకీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ ప్రత్యేక హోదా విషయంలో. ఇప్పుడు చంద్రబాబు అధికారం పోయి జనం మీద విరుచుకుపడుతున్నారు.. రేప్పొద్దున్న వైఎస్ జగన్ చేయబోయేది కూడా ఇదే. తేడాలేం లేవు. చంద్రబాబు కాకపోతే జగన్.. జగన్ కాకపోతే మళ్ళీ చంద్రబాబేనా.? ప్రజలు ఆలోచించుకోవాల్సిన సందర్భమిది.

ఇక, ఓట్లకు నోట్లను వెదజల్లుతున్నదెవరు.? దీన్ని రాజకీయాలకు పరిచయం చేసిందెవరు.? 2019 ఎన్నికల్లో ఓటర్లను కొనేందుకు డబ్బులు పంచలేదని టీడీపీగానీ, వైసీపీగానీ ప్రమాణం చేసి చెప్పగలవా.? ఛాన్సే లేదు.