ప్రజలే దేవుళ్ళు.. సమాజమే దేవాలయం.. అనేవారు స్వర్గీయ నందమూరి తారకరామారావు. ఆ స్వర్గీయ ఎన్టీయార్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం నేతృత్వం వహిస్తున్న చంద్రబాబు, ‘సిగ్గూ శరం లేదా.?’ అని ప్రజల్ని ప్రశ్నిస్తున్నారు. దీన్ని కలికాలం అనాలా.? ఇంకేదన్నా అనాలా.?
వైసీపీ కి జనం ఓట్లెయ్యడం నేరమా.? అదెలా కుదురుతుంది.! 2019 ఎన్నికల్లో ప్రజల్ని మెప్పించడంలో వైసీపీ సఫలమయ్యింది.. మిగతా రాజకీయ పార్టీలు విఫలమయ్యాయి. అయినా, టీడీపీకి అప్పట్లో వచ్చిన ఓట్లు తక్కువేమీ కాదు. టీడీపీ కంటే ఎక్కువ ఓట్లు వైసీపీకి వచ్చాయంతే.
రాజకీయాల్లో గెలుపోటములకు అర్థం పూర్తిగా మార్చేశాయి ప్రధాన రాజకీయ పార్టీలు. ఓ అభ్యర్థికి తాను కాకుండా ఇంకో ఓటు పడినా.. ఆ అభ్యర్థి ఒకర్ని తన భావజాలంతో ప్రభావితం చేయగలిగినట్లే. అదీ రాజకీయమంటే. చంద్రబాబు, అధికారం లేకుండా వుండలేరు.. అధికారం లేనప్పుడు చంద్రబాబులో అసహనం అత్యంత దారుణంగా వుంటుంది. అధికారంలో వున్నాసరే, తన ఇమేజ్ డౌన్ అవుతోందనుకుంటే తట్టుకోలేరు.
పంచాయితీ ఎన్నికల్లో మేమే సత్తా చాటామని ఓ పక్క చెప్పుకుంటూనే, మునిసిపల్ ఎన్నికలొచ్చేసరికి, ‘మీకు సిగ్గు లేదు’ అంటూ ఓటర్లను విమర్శించారు చంద్రబాబు. ఆ ఎఫెక్ట్ మునిసిపల్ ఎన్నికలపై పడింది.. కాదు కాదు, మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ మీద ఆ ప్రభావం తీవ్రంగా పడింది. టీడీపీని దారుణంగా దెబ్బతీశారు ఓటర్లు.
టీడీపీని అయినా, వైసీపీని అయినా, మరో పార్టీని అయినా గెలిపించేది, ఓడించేది ఓటర్లు మాత్రమే. ఆ విషయం సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న చంద్రబాబు తెలుసుకోకపోతే ఎలా.? చంద్రబాబు తిట్టిన తిట్లు బాగానే పనిచేశాయి.. అయితే, అది టీడీపీకి వ్యతిరేకంగా పనిచేయడం గమనార్హం. అటు వైసీపీ లాభపడింది. ఇంకోపక్క కొన్ని చోట్ల జనసేన ప్రతిపక్షంగా మారింది.
తిడితే జనం ఓట్లెయ్యరు.. తమకు ఓటెయ్యమని ప్రజల్ని నాయకులు, పార్టీలు అభ్యర్థించాలి. చంద్రబాబు ఈ వాస్తవం ఎప్పటికీ తెలుసుకోలేరు. ఎందుకంటే ఆయన లెక్క వేరే.