కుప్పంలో యుద్ధప్రాతిపదికన వైద్య సదుపాయాలు కల్పించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నియోజకవర్గ సిబ్బందిని ఆదేశించారు కుప్పం ప్రభుత్వాసుపత్రిలో 35 లక్షలతో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించనున్నట్లు తెలిపారు. వైద్య సిబ్బంది నియామకాల కోసం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చర్యలు తీసుకోవాలని.. అందుకు కావలసిని నిధులు కూడా సమకూరుస్తానని హామీ ఇచ్చారు. ఆసుపత్రి మొదటి అంతస్తులోని ఆక్సిజన్ ను గ్రౌండ్ ఫ్లోర్‌కి అందేలా మరమ్మతులు చేయించాలని సూచించారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా జరుగుతున్న టెలి మెడిసిన్, ఆహార పంపిణీ కార్యక్రమాన్ని మరింతగా నిర్వహించాలని సూచించారు. పల్స్ ఆక్సీమీటర్లను శనివారం అందిస్తామన్నారు. నియోజకవర్గంలోని 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కావలసిన మెడిసిన్లను వెంటనే పంపిణీ చేస్తామన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 200 పడకలు, కొత్త ఓకేషనల్ జూనియర్ కళాశాల భవనంలో 200 పడకలు ఐసోలేషన్ కోసం ఏర్పాటు చేయాలని సూచించారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు లేఖ రాస్తానన్నారు. నియోజకవర్గ ప్రజల కోసం కోటి రూపాయల ఖర్చును స్వయంగా భరిస్తున్నట్టు తెలిపారు.