అక్కుపక్షీ.. చంద్రబాబు మీదనే ఇంకా ఈ ఏడుపెందుకు.?

అక్కుపక్షి ఆవిర్భావానికి కారణం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆ రాజశేఖర్ రెడ్డి ఫొటోలతోనే ఇంకా ఆ అక్కుపక్షి ప్రస్తావన కొనసాగుతోంది మీడియా రంగంలో. ఆ రాజశేఖర్ రెడ్డిని ‘నర రూప రాక్షసుడు.. గజ దొంగ..’ అంటూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన నాయకులు.. అందునా మంత్రులు విమర్శిస్తోంటే, అక్కుపక్షికి అస్సలేమాత్రం ఆగ్రహం రాలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలెవరిలోనూ చీమూ నెత్తూరూ లేదా.? అన్న విమర్శ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నుంచి దూసుకొస్తోంది.

వైఎస్సార్ మీద అంతలా తెలంగాణ మంత్రులు తిట్లతో విరుచుకుపడుతోంటే, వైఎస్సార్ సతీమణి విజయమ్మగానీ, వైఎస్సార్ కుమార్తె షర్మిలగానీ, వైఎస్సార్ కుమారుడు జగన్ గానీ.. ఎందుకు స్పందించలేదు.? అన్నది రేవంత్ రెడ్డి ప్రశ్న. సరే, రేవంత్ ఇందులో వెతుక్కుంటోన్న రాజకీయం ఏంటి.? అనేది మళ్ళీ వేరే చర్చ.

ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని మోడీని ప్రశ్నించలేని బేలతనం.. నీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ కారణంగా ఏపీకి నష్టం జరుగుతున్నా, తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీయలేని వైనం.. ఇదీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ప్రస్తుతం సమస్య నీళ్ళతో… ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదం ముదిరి పాకాన పడుతోంది. కానీ, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితినిగానీ, తెలంగాణ ప్రభుత్వాన్నిగానీ గట్టిగా విమర్శించలేని దుస్థితి వైసీపీదీ, వైసీపీ అనుకూల మీడియాది.. మరీ ముఖ్యంగా అక్కుపక్షిది.

నిలదీయాల్సినవాళ్ళని నిలదీయలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్న వైసీపీ, వైసీపీ అనుకూల మీడియా, చంద్రబాబు విషయంలో అసందర్భ ప్రేలాపన పేలుతుండడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. చంద్రబాబు తన వ్యక్తిగత అవసరాల కోసం ఆంధ్రపదేశ్ నీటి ప్రయోజనాల్ని తెలంగాణకి తాకట్టు పెట్టేశారన్నది అక్కుపక్షి వెకిలి రాత.

చంద్రబాబు హయాంలో ఏపీ వర్సెస్ తెలంగాణ.. నీటి యుద్ధం ఎందుకు జరిగింది.? చంద్రబాబు ఎందుకు కేసీయార్‌కి రాజకీయ శతృవు అయ్యారు.? కేసీయార్ చెప్పినట్లు చంద్రబాబు ఆడలేదనే కదా.? మరి, వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏం జరుగుతోంది.? కేసీయార్ – వైఎస్ జగన్ దోస్తులయ్యారు.. కారణం, కేసీయార్ అడగ్గానే, హైద్రాబాద్ మీద ఏపీకి వున్న హక్కులని పూర్తిగా జగన్ సర్కార్ వదులుకోవడం వల్లనే కదా.?

సరే, చంద్రబాబు హయాంలో జరిగిన తప్పిదాలేంటి.? అన్నది వేరే చర్చ. కానీ, ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం కోసం వైఎస్ జగన్, కేసీయార్‌తో ఎందుకు చర్చించడంలేదో ఎవరికీ అర్థం కావడంలేదు. నీటి ప్రాజెక్టుల విషయంలో కేసీయార్ మీద విమర్శలు చేసేంత సాహసం జగన్ చేయకపోవచ్చు. కానీ, తన తండ్రిని నర రూప రాక్షసుడిగా అభివర్ణిస్తోన్నవారి విషయంలో అయినా, వైఎస్ జగన్ ఎందుకు స్పందించలేకపోతున్నారు.? మరీ, అంతలా కేసీయార్‌ని చూసి వైఎస్ జగన్ భయపడాలా.? అన్నది సగటు వైఎస్సార్ అభిమానుల ఆవేదన.