తప్పు తెలుసుకుంటున్న వైసీపీ.. చంద్రబాబు గెలిచినట్టే.!

దొంగలు పడ్డ ఆర్నెళ్ళకు.. అన్న చందాన టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నోరు జారిన నెల రోజుల తర్వాత, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కంట కన్నీరు వచ్చింది. సరే, వంశీని లైట్ తీసుకున్నారుగానీ, అసెంబ్లీ సాక్షిగా అదే అవమానం ఇంకోసారి జరిగేసరికి చంద్రబాబు గుక్కపట్టి ఏడ్చారన్నది వేరే వాదన.

తప్పెవరిది.? అంటే, ముమ్మాటికీ వైసీపీదే. టీడీపీ నుంచి వైసీపీలోకి దూకేసిన వల్లభనేని వంశీ స్వయంగా ఒప్పేసుకున్నారు తాను చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు. ఆ వ్యాఖ్యల పట్ల ఆయన విచారం కూడా వ్యక్తం చేశారు. సో, వైసీపీ ఇక డ్రామాలు ఆడి ప్రయోజనం లేదు.

తాజాగా వైసీపీకే చెందిన మరో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కూడా, చంద్రబాబు సతీమణి మీద తమ పార్టీ నాయకులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పట్ల తీవ్రమైన బాధ వెల్లగక్కారు. నారా భువనేశ్వరి కాళ్ళను తమ కన్నీళ్ళతో కడిగి క్షమాపణ చెబుతామన్నారు రాచమల్లు.

సో, చంద్రబాబు చేసిన ఆరోపణ నిజమేనన్నమాట. చంద్రబాబు సతీమణి మీద వైసీపీ నేతలు జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారని తేటతెల్లమైపోయింది. కానీ, మంత్రి కొడాలి నాని సహా పలువురు వైసీపీ నేతలు, ‘మేమెవరం చంద్రబాబు సతీమణి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు..’ అంటూ ఇంకా బుకాయిస్తూనే వున్నారు.

తనపై వైసీపీ నేతలు చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యల పట్ల చంద్రబాబు సతీమణి కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఓ బహిరంగ లేఖ కూడా విడుదల చేశారు. ఆ తర్వాతే సీన్ పూర్తిగా మారిపోయింది. మాజీ ముఖ్యమంత్రి సతీమణి మీద, అందునా స్వర్గీయ నందమూరి తారకరామారావు కుమార్తెపైన దిగజారుడు వ్యాఖ్యలు చేయడం ద్వారా వైసీపీ, ప్రజల్లో పలచనైపోయింది.

వాస్తవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ప్రసహనంపై స్పందించి వుండాల్సింది. తమ పార్టీ నాయకుల్ని వారించి వుండాల్సింది. అలా వారించి వుండకపోవడంతోనే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చింది. మొత్తానికి పడిపోతున్న టీడీపీ ఇమేజ్‌కి జాకీలేసి వైసీపీ పైకి లేపిందన్నమాట. ఇదంతా టీడీపీ – వైసీపీ కలిసి ఆడిన డ్రామా కాదు కదా.?