మెగాస్టార్ ప్లానింగ్.. టెన్షన్ లో ఫ్యాన్స్

మెగాస్టార్ చిరంజీవి ప్లానింగ్ మెగా అభిమానుల్ని కలవరపెడుతోంది. ఆయన ఎంచుకుంటున్న సినిమాలని చూసి ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన మూవీ ‘ఆచార్య’ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద దారుణ ఫలితాన్ని ఎదుర్కొంది. రెండేళ్ల విరామం తరువాత మెగాస్టార్ నుంచి ఇలాంటి సినిమా వస్తుందని ఫ్యాన్స్ ఊహించలేదు. అంతే కాకుండా వరుస బ్లాక్ బస్టర్ లని అందించిన స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఇలాంటి మెగా ఫ్లాప్ ని ఇస్తాడని కలలో కూడా ఊహించలేదు.

ఊహకందని రీతిలో ‘ఆచర్య’ మూవీని అందించడంతో మెగా ఫ్యాన్స్ షాక్ లోకి వెళ్లిపోయారు. బ్లాక్ బస్టర్ సినిమా వచ్చేందంటూ సంబరాలు చేసుకుంటే ఇలాంటి సినిమానిచ్చారేంటీ? అని ఆలోచనలో పడ్డారట. స్టార్ డైరెక్టర్ తో చేసిన సినిమా ఫలితమే ఇలా వుంటే ఇక మామూలు రేంజి డైరెక్టర్ సినిమా పరిస్థితి ఏంటని టెన్షన్ కు గురవుతున్నారట. ఈ క్రమంలో మెగాస్టార్ సినిమాల లైనప్ ఇప్పడు మెగా ఫ్యాన్స్ కి కంటి మీద కునుకులేకుండా చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం మెగాస్టార్ బ్యాక్ టు బ్యాక్ మూడు భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇందులో రెండు రీమేక్ సినిమాలు. ఒకటి తమిళ బ్లాక్ బస్టర్ ‘వేదాలం’ ఆధారంగా తెరకెక్కుతున్న ‘భోళా శంకర్’. మరొకటి మలయాళ హిట్ ఫిల్మ్ ‘లూసీఫర్’ ఆధారంగా రూపొందుతున్న ‘గాడ్ ఫాదర్’.

ఈ రెండు సినిమాలే ఇప్పడు ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్నాయట. ఇందులో ‘భోళా శంకర్’ మూవీ మరీ కంగారు పెట్టేస్తోందని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్ తో ‘షాడో’ వంటి ఫ్లాప్ ని అందించిన మెహర్ రమేష్ సినిమా చేసి దాదాపు 9 ఏళ్లవుతోంది. ఆయనని తెలుగు ఆడియన్స్ ఎప్పుడో మర్చిపోయారు.

ఇలాంటి ట్రాక్ వున్నమెహర్ కు ‘భోళా శంకర్’ బాధ్యతల్ని చిరు అప్పగించడం ఫ్యాన్స్ ఇబ్బందిపెడుతోంది. ఇక ‘గాడ్ ఫాదర్’ విషయంలోనూ కొంత టెన్షన్ కు గురవుతున్నారు. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నారు. చిరుతో ఇదే తొలి సినిమా. ‘హనుమాన్ జంక్షన్’ తరువాత తెలుగులో ఆయన చేస్తున్న సినిమా ఇది. అలాంటి డైరెక్టర్ చిరు క్రేజ్ ని పట్టుకోగలడా అన్నది ఫ్యాన్స్ అనుమానం. ఇక మూడవది బాబీ సినిమా. ఈ డైరెక్టర్ స్టార్ లతో చేసిన సినిమాలు దాదాపుగా పోయాయి. జై లవకుశ వెంకీ మామ సర్దార్ గబ్బర్ సింగ్ .. ఇలా అన్నీ స్టార్ లతో తీసినావే కానీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి.

అంతే కాకుండా బాబీ అనుభవం ఈ సినిమాకు సరిపోవడం లేదట. కొన్ని విషయాల్లో చిరు అసంతృప్తిని కూడా వెల్లగక్కారని ఇన్ సైడ్ టాక్. ఇలాంటి ముగ్గురు డైరెక్టర్లతో చిరు వరుసగా మూడు సినిమాలు చేస్తుండటంతో ఫ్యాన్స్ వీటి పరిస్థితేంటీ? అని టెన్షన్ పడుతున్నారట. అనుభవం వున్న స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ‘ఆచార్య’ రూపం లో భారీ షాకిస్తే మరి వీళ్ల పరిస్థితేంటీ? అని ఆలోచిస్తున్నారట.