AHA ఓటీటీ రంగంలో స్కై ఈజ్ లిమిట్ అన్న చందంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రాంతీయ ఓటీటీల్లో ఇప్పటివరకూ అత్యంత ఆదరణతో నంబర్ వన్ గా కొనసాగుతోంది. దీనికి కారణం కోట్లాది రూపాయల బడ్జెట్లతో ఒరిజినల్ కంటెంట్ ని రూపొందించి అరవింద్ సక్సెస్ లు అందించడమేననడంలో సందేహం లేదు. ఇరుగు పొరుగు భాషల్లో బ్లాక్ బస్టర్ సినిమాలను తెలుగు ఆడియెన్ కి అందుబాటులో లేని వాటిని కూడా ఆహా వేదికపై అందిస్తుండడంతో కంటెంట్ పెద్ద సక్సెసైంది.
ఆహా గత కొన్ని నెలలుగా మంచి ప్రాజెక్ట్ లను రూపొందిస్తోంది. ఇప్పుడు ప్రతిభావంతుడైన గాయకుడు శ్రీరామ చంద్ర హోస్ట్ గా ‘ఇండియన్ ఐడల్’ షో అత్యంత ప్రజాదరణ పొందింది. కొద్ది రోజుల క్రితం నందమూరి బాలకృష్ణ సెమీ ఫైనల్స్ కు హాజరై బోలెడంత సందడి చేసారు.
తాజా సమాచారం మేరకు.. మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ ఫినాలేకి అటెండవుతారని తెలుస్తోంది. ఫినాలేలో చిరంజీవి మెస్మరైజింగ్ అప్పియరెన్స్ కోసం మేకర్స్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారని తెలిసింది. తమన్- నిత్యా మీనన్- గాయకుడు కార్తీక్ ఈ షోకి న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.
చిరుతో అరవింద్ సినిమా ఎపుడు?మెగాస్టార్ చిరంజీవితో అల్లు అరవింద్ నిర్మించే సినిమా ఎప్పుడు ఉంటుంది? ఈ ప్రశ్నకు ఇటీవలి కాలంలో సరైన జవాబు లేదు. నిజానికి చిరంజీవి రీఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 ని అరవింద్ నిర్మించాల్సింది. కానీ రామ్ చరణ్ స్వయంగా కొణిదెల ప్రొడక్షన్స్ కంపనీ బ్యానర్ ని స్థాపించి ఇందులో ఆ క్రేజీ చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత చిరు 151 కోసం బాస్ అరవింద్ చాలా ట్రై చేసినా కుదరలేదు.
బోయపాటి ఆ చిత్రానికి దర్శకత్వం వహించాల్సి ఉన్నా ప్రాజెక్ట్ ముందుకెళ్లలేదు. కనీసం చిరంజీవి తో 152వ సినిమా అయినా చేయాలనుకున్నా అదీ కుదరలేదు. ఇటీవల చిరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు.
ప్రతిదీ కొణిదెల బ్యానర్ లోనే తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు వరుసగా మూడు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. కానీ అరవింద్ నిర్మాతగా చిరు ఏ ఒక్కటీ చేయడం లేదు. మెగాస్టార్ కి మరపురాని హిట్లు ఇచ్చిన నిర్మాతగా అల్లు అరవింద్ కి ఒక ఛాన్సుంటుందనే అభిమానులు భావిస్తున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్ ని అల్లు అరవింద్ ఎలా వర్కవుట్ చేస్తారో వేచి చూడాలి.