పొట్టి వీరయ్య మరణ వార్త నన్ను బాధించింది: చిరంజీవి

ప్రముఖ హాస్య నటుడు పొట్టి వీరయ్య గుండెపోటుకి గురై చికిత్స పొందుతూ హైదరబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల చిరంజీవి సంతాపం తెలిపారు. ‘వీరయ్య మరణ వార్త నన్ను కలచి వేసింది. వీరయ్య వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో సవాళ్లని అధిగమించారు. వందల చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని అన్నారు.

రాజశేఖర్, జీవిత దంపతులు వీరయ్య కుటుంబ సభ్యుల్ని పరామర్శించి, సానుభూతి వ్యక్తం చేశారు. వీరయ్య చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వీరయ్యతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘వీరయ్య అగ్ర హీరోలు, మాతోనూ కలిసి నటించారు. వైకల్యాన్ని జయించారు. (మా) మీటింగ్స్‌, అవార్డుల వేడుక.. ఏ కార్యక్రమానికి పిలిచినా వచ్చేవారు. నవ్వుతూ, నవ్విస్తూ ఉండే వీరయ్య మృతి బాధాకరం. ఆయన మరణం బాధ కలిగించింది. ఆయన కుటుంబానికి వీలైనంత సాయం చేస్తాం’ అన్నారు.