రూపాయి.. రూపాయి.. నువ్వేం చెయ్యగలవ్.? అంటే, తల్లిదండ్రుల్ని విడగొట్టగలను.. అన్నదమ్ముల మధ్య చిచ్చపెట్టగలను.. అన్నదట. రాజకీయం కూడా అంతే. మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవికీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కీ మధ్య చిచ్చపెడుతోంది రాజకీయం. కాదు కాదు రాజకీయ జర్నలిజం చిచ్చపెడుతోంది. నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టు, నిస్సిగ్గుగా చెత్త కథనాల్ని ఓ వర్గం మీడియా వండి వడ్డిస్తోంది.
చిత్రమేంటంటే, ఈ విషయంలో ఆయా మీడియా సంస్థలన్నీ కులాలకి, మతాలకి అతీతంగా ఒక్కటైపోతుంది.. ఆ ‘మంద’ అంతా కలిసి, ‘మెగా కాంపౌండ్‘ మీద విషం చిమ్ముతుంది. వీలైతే కులం, లేకపోతే మతం పేరుతో ఇటు రాజకీయం, అటు దిక్కుమాలిన జర్నలిజం.. ‘మెగా కాంపౌండ్‘లో చిచ్చపెట్టడానికి ప్రయత్నిస్తూనే వుంటుంది.
మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ సీటు కావాలంటే అదేమైనా గగనమా.? ఊరూ పేరూ లేని వ్యక్తులు కోట్లు గుమ్మరించి తేలిగ్గా కొనుక్కుంటున్న పదవిగా మారిపోయిందది ఇటీవలి కాలంలో. అది కొనుక్కోవాలంటే చిరంజీవికి పెద్ద కష్టమేమీ కాదు. చిరంజీవి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయన కోరుకుని వుంటే, ఇంకోసారి రాజ్యసభ పదవి దక్కి వుండేది. బీజేపీలో ఆయన చేరాలనుకుంటే అదెంతపని.? చిటికెలో అయిపోతుంది.. రాజ్యసభ పదవేంటి.? కేంద్ర మంత్రి పదవి కూడా రావొచ్చు. పవన్ కళ్యాణ్ అయినా అంతే. ఇప్పటికీ పవన్ ముందు ‘కేంద్ర మంత్రి’ అనే ఆఫర్ వుండనే వుంది.
పదవుల కోసం గడ్డితినే లెక్క అయితే.. పార్టీలు పెట్టి, జనానికి నోట్లు పంచకుండా.. మార్పు కోసమెందుకు చిరంజీవి అయినా, పవన్ కళ్యాణ్ అయినా ప్రయత్నిస్తారు.? నోట్లు పంచితే, 2009 ఎన్నికల్లోనే చిరంజీవి రాజకీయంగా ఎవరూ ఊహించని స్థాయికి ఎదిగేవారు.. పవన్ కళ్యాణ్ 2019లో తిరుగులేని విజయాన్ని అందుకునేవారు. వైసీపీ, చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వాలనుకుంటోందట. చిరంజీవి, వైసీపీ పంచన చేరబోతున్నారట. చిరంజీవి, వైఎస్సార్సీపీకీ అన్ని విధాలా సహకరిస్తున్నారట.. అలాగని ఓ వర్గం మీడియా.. నీతీ జాతీ లేని రీతిలో కథనాల్ని ప్రసారం చేస్తోంది.
మెగా అభిమానులు జనసేన పార్టీకి చేరువ కాకుండా గందరగోళం లో పడేయటమే…దీని వెనుక ఉద్దేశంలా ఉంది. చిరంజీవి కి సేవలు చేయటం కొత్త కాదు.. ఇప్పుడు చేస్తున్న సేవలను తమ మీడియాలో కవర్ చేయకపోగా… రాజ్యసభ సీటు కోసం అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు.
చిరంజీవి కాంపౌండ్.. ఈ దిగజారుడు వార్తలను చూసి ఆశ్చర్య పోతుంది.. మా బాస్ కు అంత ఆగత్యం పట్టలేదని గట్టిగా చెబుతున్నారు.
జనసైనికులు కరోనా నేపథ్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు ఈ మీడియాకి కనిపించడంలేదు.. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంక్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలూ వీళ్ళెవరికీ కనిపించడంలేదు. ఔను, కనిపించవు. ఎందుకంటే, వాళ్ళ కళ్ళు కరెన్సీతోనో, కుల దురహంకారంతోనే కప్పివేయబడ్డాయి మరి.