నో డౌట్.. చిరంజీవి చుట్టూ పెద్ద ‘పొలిటికల్’ కథే నడుస్తోంది

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రపదేశ్ రాష్ట్రం నుంచి మాజీ కేంద్ర మంత్రి, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభకు వెళ్ళబోతున్నారా.? గతంలో కాంగ్రెస్ పార్టీ ఆయన్ను రాజ్యసభకు పంపిన విషయం విదితమే. కాంగ్రెస్ హయాంలోనే చిరంజీవి కేంద్ర మంత్రిగా పనిచేశారు. అయితే, రాజ్యసభ సభ్యుడిగా తన పదవీ కాలం పూర్తవకముందే ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన దూరమయ్యారు.

పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనలో చిరంజీవి చేరతారని గతంలో ప్రచారం జరిగినా, చిరంజీవి అటువైపు చూడలేదు సరికదా.. ‘మా ఇద్దరి ఆలోచనలు వేరు.. గమ్యం ఒకటే అయినా.. మా దారులు ఎప్పటికీ కలవవు..’ అని ‘రైలు పట్టాల్ని’ చిరంజీవి ఉదహరించారు.

ఇక, చిరంజీవికి గాలమేసేందుకు భారతీయ జనతా పార్టీ చాలా చాలా ప్రయత్నాలే చేసిందిగానీ, సఫలం కాలేదు. ఈసారి మాత్రం.. ప్రయత్నాలు మరింత గట్టిగా సాగుతున్నాయి.. ఇటు బీజేపీ నుంచీ, అటు వైఎస్సార్సీపీ నుంచీ. ఆంధ్రపదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ మీద సోషల్ మీడియా వేదికగా చిరంజీవి ప్రశంసలు గుప్పించారు. అంతే, మళ్ళీ పొలిటికల్ హీట్ పెరిగింది. దాన్ని ఒక్కొక్కరూ ఒక్కోలా అర్థం చేసుకున్నారు.

పవన్ కళ్యాణ్, చిరంజీవి కొట్టిన దెబ్బతో షాక్ అయ్యారనీ.. జనసైనికులు విలవిల్లాడారనీ ఇటు వైసీపీ, అటు టీడీపీ పండగ చేసుకున్నాయి. ఇంతలోనే, ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, చిరంజీవికి థ్యాంక్స్ చెప్పారు సోషల్ మీడియా వేదికగా. ఇంకేముంది.. పొలిటికల్ హీట్ మరింత పెరిగింది.

చిరంజీవికి తిరిగి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం వుందని అనుకోలేం. ఎందుకంటే, ఆయన రాజకీయాల్లో పడ్డ ఇబ్బందులు అలాంటివి. తిరిగి సినీ రంగంలోకి రావడం వల్ల చిరంజీవి పొందిన గౌరవం అంతా ఇంతా కాదు. దాన్ని ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి రావడం ద్వారా పాడు చేసుకున్నట్లవుతుంది. కానీ, చిరంజీవిని ఎలాగోలా వివాదాల్లోకి లాగి రాజకీయ లబ్ది పొందాలనే ప్రయత్నాలు మాత్రం వివిధ రాజకీయ పార్టీలు చేస్తుంటాయి.

చిరంజీవిని పొగడటం వల్లో.. తిట్డడం వల్లో.. ఎలాగైతేనేం, ఆయా పార్టీలు పొందాల్సిన పొలిటికల్ మైలేజ్ అయితే పొందుతాయి. ఇదీ చిరంజీవి చుట్టూ నడుస్తున్న పొలిటికల్ కథ.