మెగాస్టార్ చిరంజీవి ఆక్సీజన్ బ్యాంక్ కరోనా సెకండ్ వేవ్ సమయంలో చాలా ప్రభావవంతంగా పని చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మెగా అభిమానులు చాలా కష్టపడి ఆక్సీజన్ సిలిండర్లను అందించి కొన్ని వందల మంది ప్రాణాలు కాపాడారు. దాంతో ఆక్సీజన్ సిలిండర్లను సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషించిన మెగా అభిమానులను చిరంజీవి కలిశారు. తెలంగాణ జిల్లాల నుండి వచ్చిన వారితో చిరంజీవి కొద్ది సమయం ముచ్చటించాడు. ఆ సమయంలో చిరంజీవి కుడి చేతికి కట్టు ఉండటంను మీడియా వర్గాల వారు గుర్తించి అసలేం జరిగిందంటూ ప్రశ్నించారు.
మీడియా వారి ప్రశ్నకు సమాధానంగా చిరంజీవి మాట్లాడుతూ.. గత కొన్నాళ్లుగా కుడి చేయి నొప్పి లేవడంతో పాటు తిమిర్లు అవ్వడం జరుగుతుంది. దాంతో నేను అపోలో ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్నాను. చేతి మణికట్టు దగ్గర్లో ఉన్న నర్వ్ మీద ఒత్తిడి పడటం వల్లే ఈ ఇబ్బంది తలెత్తిందని వైధ్యులు నిర్థారించారు. డాక్టర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చేతికి సర్జరీ జరిగింది. 45 నిమిషాల పాటు జరిగిన ఆపరేషన్ లో నర్వ్ చుట్టు ఉన్న టిష్యులను సరి చేశారు. 15 రోజుల్లో అంతా నార్మల్ అవుతుంది. ఆపరేషన్ కారణంగానే గాడ్ ఫాదర్ ను ఆపినట్లుగా చెప్పుకొచ్చాడు. రెండు వారాల్లో మళ్లీ యధావిధిగా షూటింగ్ లో పాల్గొంటాను అన్నాడు.