అవార్డులేవీ? ఏపీ- తెలంగాణ ప్రభుత్వాలకు చిరు ప్రశ్న!

ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ రెండుగా డివైడ్ అయ్యాక టాలీవుడ్ తరలింపు గురించి విస్త్రతంగా చర్చ సాగింది. ఆ తరవాత రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వం తరపున ఇచ్చే అవార్డులకు అయిపు లేకుండా పోయింది. ఏపీలో నంది అవార్డులు ఇచ్చే ప్రయత్నం ఒక సారితోనే అయిపోయింది. ఆ తర్వాత ఆ ఊసే లేదు. ఇక తెలంగాణలో సింహా పేరుతో ప్రభుత్వం అవార్డులిస్తుందని అన్నారు. వాటి విషయంలోనూ క్లారిటీ మిస్సయ్యింది. అయితే ఈ వ్యవహారంపై ప్రభుత్వాల శైలిని మెగాస్టార్ తప్పు పట్టారు.

తాజాగా జరిగిన `సంతోషం- 2021` అవార్డుల వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ … నిజంగా సినిమా కళాకారులకు అవార్డులు అనేవి ఓ గొప్ప ఉత్సహాన్ని ఇచ్చే వేడుక. అవార్డు వేడుకలు ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం సినిమా కళాకారులను అవార్డులు అందించి సత్కరించాలి. కానీ రాష్ట్రం విడిపోయిన తరువాత అటు ఆంధ్రా ప్రదేశ్ ప్రభుత్వం కానీ.. ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఈ అవార్డు వేడుకల విషయం మరచిపోయాయి అని అసహనం వ్యక్తం చేశారు. ఇకపై అయినా ఈ రెండు ప్రభుత్వాలు అలోచించి అవార్డు వేడుకలు నిర్వహించాలని ఆయన సూచించారు. 20ఏళ్లుగా సంతోషం అవార్డుల వేడుక జరగడం అభినందనీయం అని అన్నారు. ఇక ఈ వేదికపై వందమంది సింగర్స్ తో వంద పాటలతో మనం అందరం కోల్పోయిన ఎస్పీ బాలు కు ట్రిబ్యూట్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉందని అల్లు అరవింద్ అన్నారు.

తలసాని మాట్లాడుతూ- “తెలుగు చిత్రపరిశ్రమ ఈ మధ్య దేశ వ్యాప్తంగా గొప్ప పేరు తెచ్చుకుంటుంది. మన సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అవుతున్నాయి. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా సినిమా రంగానికి గొప్ప ప్రోత్సహం అందించే దిశగా ఎప్పుడు ముందు ఉంటుంది“ అన్నారు. ఇదే వేదికపై ప్రముఖ దర్శకుడు భారతీరాజా మాట్లాడుతూ .. తెలుగు ప్రేక్షకులు అంటే నాకు చాలా ఇష్టం. వారు సినిమా బాగుంటే చాలు ఆదరిస్తారు. నా సినిమాలు ఎన్నో తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ఇక చిరంజీవి ఆనాడు అలా ఉన్నాడో ఇప్పటికే అదే డెడికేషన్.. అదే స్పిరిట్ తో ఉన్నాడు. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి చిరంజీవి. అలాగే తెలుగు ప్రజలకు సినిమా అంటే మమకారం అందుకే పాండమిక్ సమయంలో కూడా థియటర్స్ కు దైర్యంగా వచ్చి మికు మేమున్నాం అని నిరూపించారు… అని ప్రశంసించారు.