మెగాస్టార్ చిరంజీవి మునుపెన్నడూ లేనంతగా సినిమాల పరంగా స్పీడు పెంచేశారు. ఊహకందని డైరెక్టర్లకు ఛాన్స్లిస్తూ వరుస ట్విస్ట్‌లతో ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీ వర్గాలకు కూడా షాకుల మీద షాకులిస్తున్నారు. ఆయన వరుసగా సినిమాల్ని అంగీకరిస్తున్న తీరుకి… సినిమాల విషయంలో చిరు చూపిస్తున్న స్పీడుకీ సినీ జనంతో పాటు మెగాస్టార్ ఫ్యాన్స్ కూడా విస్తూ పోతున్నారు. ప్రస్తుతం కొరటాల శివతో చేస్తున్న `ఆచార్య` చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.
కొంత బ్యాలెన్స్ గా వున్న షూట్‌ని ప్రస్తుతం పూర్తి చేసే పనిలో వున్నారు చిరు. దీనితో పాటు మరో మూడు చిత్రాలని లైన్లో పెట్టిన మెగాస్టార్ తాజాగా యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల చిత్రాన్ని కూడా ఓకే చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్న చిత్రాల్లో బాబీ డైరెక్ట్ చేస్తున్న సినిమాపై తాజాగా ఓ ఆసక్తికరమైన రూమర్ ప్రచారంలో వుంది.
ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ మొదలైంది. ఇప్పటికే పవన్ కల్యాణ్‌తో సినిమా చేసిన బాబీ స్వతహాగా మెగాస్టార్ అభిమాని. ఆయనని ఫ్యాన్స్ ఎలా చూడాలని అనుకుంటున్నారో తన చిత్రం ద్వారా ఆ స్థాయిలో ప్రజెంట్ చేయాలని ఓ సరికొత్త కథతో చేస్తున్న సినిమా ఇది. దీంతో ఈ సినిమా ఓ రేంజ్ లో వుంటుందనే వార్తలు నిత్యం షికారు చేస్తూనే వున్నాయి.
ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ ప్రీ లుక్ సినిమా అంతా కోస్టల్ ఏరియా నేపథ్యంలో సాగుతుందనే సంకేతాల్ని అందిస్తోంది. ఇక ప్రీ లుక్ లో `ముఠామేస్త్రీ` పాత్రని తలపించేలా కనిపించడంతో చిరు పోర్టు లో పని చేసే కూలీగా కనిపిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఇందులోనే అసలు ట్విస్ట్ దాగి వుందని… చిరు ఇందులో `పోకిరి` తరహాలో అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారని ఈ మూవీ ప్రధాన నేపథ్యం శ్రీలంక అనే ఆసక్తికరమైన రూమర్ ఒకటి నెట్టింట సందడి చేస్తోది. ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్ కి ఇక పండగే అంటున్నారు ఇండస్ట్రీ జనం.
భారీ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీకి యువ సంగీత సంచలనం రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ మొదలైన ఈ మూవీ వచ్చే ఏడాది ఎండింగ్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.