దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఘనకీర్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. సౌత్ సినిమా జెండా జాతీయ అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడుతోందంటే.. తెలుగు సినిమా ఘనకీర్తి వినువీధిలో మార్మోగుతోందంటే దానికి కారకుడు జక్కన్న. బాహుబలి ఫ్రాంఛైజీతో పాన్ ఇండియా రణానికి శంకం పూరించిన జక్కన్న ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో దానిని మరో లెవల్ కి చేర్చాడు. ఇప్పుడు ఏ నోట విన్నా రాజమౌళి గురించిన ప్రస్తావనే.
తాజాగా ఆచార్య ప్రచార వేదికపై దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళిని మెగాస్టార్ చిరంజీవి పతాక స్థాయిలో ప్రశంసల్లో ముంచెత్తారు. హిందీ సినిమాని హైలైట్ చేస్తూ దిల్లీలో జాత్యాహంకారాన్ని ప్రదర్శించిన తీరును .. ప్రాంతీయ సినిమాపై హిందీ వోళ్ల దురహంకారాన్ని ప్రశ్నించిన మెగాస్టార్ చిరంజీవి తీవ్ర ఎమోషన్ తో దునుమాడారు. రాజమౌళి వల్లనే ఈరోజు తెలుగు సినిమా ఘనకీర్తి ప్రాంతీయ సినిమా కీర్తి జాతీయ స్థాయిలో వెలుగుతోందని అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి ఇంకా చాలా వియాలు మాట్లాడుతూ “నేను గర్వపడేలాగా రొమ్ము విరుచుకునేలాగా తెలుగు సినిమా అంటే ప్రాంతీయ సినిమా కాదని హద్దులు చెరిపేసి మాదంతా ఒకటే భారతదేశం అని నిరూపిస్తూ… మా సినిమాలన్నీ కూడా ఇండియన్ సినిమాలే అని ప్రతీ ఒక్కరూ గర్వపడేలాగా.. ఆశ్చర్యపోయేలాగా బాహుబలి- బాహుబలి 2-ఆర్.ఆర్.ఆర్ నిలిచాయి.
అలాంటి సినిమాల నిర్మాణ కర్త .. దిగ్ధర్శకుడు రాజమౌళి ఇక్కడ ఉండటం అనేది ఎంతో ఆనందంగా ఉంది. ఆయన మన తెలుగువాడు కావడం అనేది.. మన టెక్నీషియన్ అనేది నభూతో న భవిష్యత్ అనాలి. జీవితాంతం తెలుగు చిత్ర పరిశ్రమ రాజమౌళిగారిని గుర్తుంచుకోవాలి. భారతీయ సినిమా ఒక మతం అయితే ఆ మతానికి పీఠాధిపతి రాజమౌళి. ఆయన మనమందరం ఈరోజు గర్వపడేలా మన సినిమాను జాతీయ స్థాయికి కాదు.. అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లినందుకు గర్వపడుతున్నాను..“ అని అన్నారు.