సీఎం జగన్ తో టాలీవుడ్ ప్రముఖుల భేటీ

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ఆర్.నారాయణ మూర్తి, పోసాని కృష్ణమురళి, ఆలీ ఉన్నారు. ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై చర్చించేందుకు ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందడంతో వీరంతా కలిసి వచ్చారు.

ఈ భేటీలో జీవో నెం.35లో సవరణలు, టికెట్ ధరల పెంపు, ఏసీ, నాన్ ఏసీ ధియేటర్లలో టికెట్ ధరలు, మల్టీప్లెక్స్ ధియేటర్లలో ఆహార పదార్ధాల ధరలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. కరోనా తగ్గుముఖం పట్టడం, కొత్త సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండటం నేపథ్యంలో నేటి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఈ అంశాలపై కమిటీ రిపోర్టు ప్రభుత్వానికి చేరింది.

సినీ ప్రముఖులు ప్రత్యేక విమానంలో వస్తున్న ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. మహేశ్-నమ్రత పెళ్లిరోజు కావడంతో మహేశ్ కు చిరంజీవి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపినట్టు తెలుస్తోంది.