తెలంగాణ రాష్ట్రంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి హుజూరాబాద్ ఉప ఎన్నికతో పెద్ద తలనొప్పే వచ్చి పడినట్లుంది. కాదు కాదు, ముఖ్యమంత్రి కేసీయార్ స్వయానా ఈ తలనొప్పి కొని తెచ్చుకున్నట్లుంది. లేకపోతే, తన మంత్రి వర్గంలోనూ, తన పార్టీలోనూ కీలక నేత అయిన ఈటెల రాజేందర్ విషయంలో కేసీయార్, తొందరపాటు నిర్ణయం ఎందుకు తీసుకున్నారు.? ఎందుకు ఆయన్ని మంత్రి వర్గం నుంచి తొలగించారు.? ఎక్కడో ఏదో పెద్ద పొరపాటే జరిగింది.
తెలంగాణ రాష్ట్ర సమితిని ఎవరో వెన్నుపోటు పొడిచి వుండాలి, ముఖ్యమంత్రి కేసీయార్‌ని తప్పుదోవ పట్టించడం ద్వారా. నిజానికి, ఈటెల రాజేందర్ ఉద్యమ నాయకుడు. అయినాగానీ, కేసీయార్ మాటని ఏనాడూ ఆయన జవదాటలేదు. కేసీయార్ కంటే తాను పెద్ద నాయకుడినని ఈటెల ఎప్పుడూ చెప్పుకోలేదు. ఈటెల వెనుక ఎంత బలం, బలగం వున్నా.. ఆయన వాటిని ఎప్పుడూ చూపలేదు.
కానీ, సీన్ మారిందిప్పుడు. తన బలాన్ని ప్రదర్శించేందుకు ఈటెల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీలోకి వెళ్ళారాయన. ఆ బీజేపీ నుంచే హుజూరాబాద్ నియోజకవర్గానికి జరగబోయే ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నారు. రాజీనామా విషయమై కిందా మీదా పడి, చివరికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటెల రాజేందర్ పూర్తి ధీమాగా కనిపిస్తున్నారు.
ఈటెలను దెబ్బ కొట్టడానికి అత్యంత వ్యూహాత్మకంగా దళిత బంధు అనే సంక్షేమ పథకాన్ని తెరపైకి తెచ్చారు కేసీయార్. దాంతో, ఒక్కసారిగా ఈక్వేషన్ మారిపోయిందని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. కానీ, ఇంతలోనే కేసీయార్ మీద కొత్త బాంబు పేలింది. అదే, దళిత ముఖ్యమంత్రి రగడ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగాక తొలి ముఖ్యమంత్రి దళితుడేనని చెప్పింది స్వయంగా కేసీయార్. కానీ, ఆయన మాట తప్పారు. అదిప్పుడు, హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా చర్చనీయాంశమవుతోంది.
దళితుల మీద మమకారం, చిత్తశుద్ధి వుంటే, దళిత బంధు మాత్రమే కాదు, దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి చూడు.. అంటూ కేసీయార్ మీద సెటైర్లు పేల్చతున్నాయి విపక్షాలు. దాంతో, దళిత బంధు పేరుతో చేయాలనుకున్న పబ్లిసిటీ స్టంట్ వెలవెలబోతోందని గులాబీ శ్రేణులు వాపోతున్నాయి.