కేసీయార్, జగన్ వితండవాదం: రాష్ట్రాలకు బాధ్యత లేదా.?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఈ ఇద్దరికీ, రాష్ట్ర ప్రజల పట్ల బాధ్యత వున్నట్లు కనిపించడంలేదు. నిజంగానే బాధ్యతగల ముఖ్యమంత్రులైతే పెట్రో ధరల విషయమై వాహనదారులకు ఎందుకు ‘ఉపశమనం’ కల్పించేందుకు ముందుకు రావడంలేదన్న ప్రశ్న సహజంగానే తెరపైకొస్తుంది.

నిజానికి, పెట్రో ధరల పెంపు అంటే అది కేవలం వాహనదారులకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. నిత్యావసర వస్తువుల సహా అన్ని ధరలూ పెరుగుతాయి. ఆటో, బస్ ఛార్జీలు.. రవాణా ఛార్జీలు.. ఇలా మోత మోగిపోతోందంతే.

‘కేంద్రమే పెంచింది.. కేంద్రమే తగ్గించాలి..’ అన్నది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాదన. నిజమే, కేంద్రమే పెంచింది.. కేంద్రమే తగ్గించాలి.. ఇందులో ఇంకో వాదనకు తావు లేదు. మరి, రాష్ట్రాలు ఏం చేస్తాయి.? అలాగైతే, రాష్ట్ర ప్రభుత్వాలెందుకు.? అన్న ఆలోచన సామాన్యులకు రాకుండా వుంటుందా.?

సంక్షేమ పథకాలకు తమ పేర్లు పెట్టుకుని మురిసిపోతున్న పాలకులు, ఈ తరహా వాతల విషయంలో మాత్రం, ‘మా తప్పు ఏమున్నదబ్బా.?’ అంటూ తప్పించుకు తిరిగే ధోరణి ప్రదర్శిస్తుండడం శోచనీయం. పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదలతో, రాష్ట్రాల ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది.

సామాన్యుడు చితికిపోతున్న దరిమిలా, ప్రభుత్వాలు కనీసపాటి మానవత్వం ప్రదర్శించాలి కదా.? మానవత్వం లేదు సరికదా.. కేంద్రం వాయించేస్తోంది.. మేమూ పండగ చేసుకుంటాం.. మధ్యలో ప్రజలు ఛస్తే ఛావండి.. అన్నట్టుగా అధికారంలో వున్నవారి వెటకారాలు కనిపిస్తున్నాయి.