ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న ఫిట్‌మెంట్‌ పై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికి కూడా 30 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వబోతున్నామని.. ఏప్రిల్‌ 1 నుండి అమలులోకి రాబోతున్నట్లుగా పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్‌ పద్దతిన పని చేస్తున్న వారికి కూడా ఈ ఫిట్‌మెంట్ ను ప్రకటించారు. కరోనా పరిస్థితుల కారణంగా కాస్త ఆలస్యం ఈ ప్రకటన చేస్తున్నట్లుగా సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

రాష్ట్ర అభివృద్దిలో కీలక పాత్ర పోషించిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఒక్కరికి ప్రయోజనం చేకూరేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు. పదవి విరమన వయో పరిమితిని 61 ఏళ్లకు పెంచినట్లుగా కూడా కేసీఆర్‌ పేర్కొన్నారు. ఈ పెంపు తక్షణమే వర్తిస్తుందన్నారు. కమిటీ సిఫార్సు చేసినదాని కంటే కూడా అధనంగా ప్రభుత్వం పీఆర్‌సీ ఇచ్చినట్లుగా సీఎం కేసీఆర్‌ పేర్కొన్నాడు. ప్రభుత్వ ఉద్యోగులు ఈ విషయమై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి అయిదు సంవత్సరాలకు ఒక సారి పీఆర్‌సీని ప్రకటించబోతున్నట్లుగా కూడా కేసీఆర్‌ తెలియజేశారు.