తమిళ స్టార్ హీరో విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ శంకర్ రూపొందించిన `అపరిచితుడు` సినిమాతో స్టార్ హీరోల జాబితాలో చేరిన విక్రమ్ బాల తెరకెక్కించిన `సేతు` పితామగన్ వంటి సినిమాలతో నటుడిగా తిరుగులేని గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. ఈ రెండు చిత్రాలతో కమల్ ని గుర్తు చేసిన విక్రమ్ అప్పటి నుంచి పాత్రల పరంగా ప్రయోగాలు చేస్తూనే వున్నాడు.
ఉత్తమ నటుడిగా `పితామగన్`తో జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకున్న విక్రమ్ ఇప్పటికీ అదే పంథాని కొనసాగిస్తూ నటుడిగా తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. విక్రమ్ నటించిన తాజా చిత్రం `కోబ్రా`. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించాడు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందిన ఈ మూవీలో విక్రమ్ కు జోడీగా `కేజీఎఫ్` ఫేమ్ శ్రీనిధిశెట్ఠి హీరోయిన్ నటించింది. ఈ మూవీలో హీరో విక్రమ్ విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు.
ఇదిలా వుంటే ఈ మూవీలో విక్రమ్ సరికొత్త ప్రయోగం చేస్తున్న విషయం తెలిసిందే. ఏకంగా 20 గెటప్ లలో కనిపించి సర్ ప్రైజ్ చేయబోతున్నాడు. యూనివర్సల్ స్టార్ కమల్ హీసన్ `దశావతారం` మూవీలో 10 గెటప్లు పది పాత్రల్లో నటించిన షాకిచ్చిన విషయం తెలిసిందే. అందుకు భిన్నంగా విక్రమ్ `కోబ్రా` మూవీతో ఏకంగా 20 గెటప్ లలో కనిపించబోతుండటం విశేషం.
ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ తమిళంతో పాటు తెలుగు హిందీ భాషల్లో ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఈ మూవీ ప్రమోషన్స్ ని స్పీడప్ చేసేసింది. ఎస్. లలిత్ కుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నా ఈ మూవీలోని `అధీరా..` అంటూ సాగే లిరికల్ వీడియోని చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. రాకేందు మౌళి సాహిత్యాన్ని అందించగా హరిప్రియ నకుల్ అభయాంగర్ ఆలపించారు.
ఈ పాటకు ఏ.ఆర్. రహమాన్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవగా హరీష్ కన్నన్ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. తమిళనాడులో ఈ మూవీని యంగ్ హీరో ఉదయనిధి స్టాలిన్ రెడ్ జైంట్ మూవీస్ బ్యానర్ పై రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో ఈ మూవీని ఎన్వీఆర్ సినిమా బ్యానర్ పై ఎన్వీ ప్రసాద్ రిలీజ్ చేస్తున్నారు. ఇర్షాన్ పఠాన్ మియా జార్జ్ రోషన్ మాథ్యూ కె.ఎస్. రవికుమార్ మృణాళిని రవి తదితరులు నటిస్తున్నారు.